రైతులను పరామర్శిస్తే దాడులా..? | - | Sakshi
Sakshi News home page

రైతులను పరామర్శిస్తే దాడులా..?

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం

కర్నూలు పార్లమెంటు కార్యదర్శి

సిట్రా సత్యనారాయణమ్మ

కర్నూలు (టౌన్‌): పూలింగ్‌కు భూములివ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తున్న విషయం తెలుసుకుని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడటం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కర్నూలు పార్లమెంటు రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్య నారాయణమ్మ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడులు చేయడం ఏమిటని, రాష్ట్రంలో హోంమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆదివారం స్థానిక స్వగృహంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూసి ఈ ప్రభుత్వం ఎందుకంత భయపడుతోందన్నారు. మాజీ సీఎంను కలిసిన రైతులను ఇబ్బందులు పెట్టాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పూలింగ్‌కు భూములు ఇవ్వలేదన్న అక్కసుతో రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలి ముంచేయడం దారుణమన్నారు. రైతులు పిలిస్తే అక్కడికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, పార్టీ అగ్రనేతలపై దాడులకు తెగబడటం తగదని, రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని, దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ శ్రేణుల రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌కు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు వ్యవస్థ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంశాఖ ఘోరంగా వైఫలమైందన్నారు.

జనసేన ఎమ్మెల్యేపై

కేసు నమోదు చేయాలి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని పరుష, అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రజాదరణ ఉన్న జగనన్నను విమర్శించడం వల్ల విధ్వేషాలు రెచ్చగొట్టే కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ నేతల కుట్రలను వైఎస్సార్‌సీపీ బలంగా తిప్పి కొడుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement