‘ఎక్మో’తో మంచి ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

‘ఎక్మో’తో మంచి ఫలితాలు

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

● అపోలో క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి

కర్నూలు(హాస్పిటల్‌): ఆధునికంగా అభివృద్ధి చెందిన ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) చికిత్స ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగుల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని అపోలో హాస్పిటల్‌ (హైదరాబాద్‌) క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుబ్బారెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్‌, ఏపీఐ చాప్టర్‌ కర్నూలు సంయుక్తంగా ఆదివారం ఓ హోటల్‌లో నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు(సీఎంఈ) నిర్వహించారు. ఎక్మో ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇవ్వాలనే అంశంపై డాక్టర్‌ కె.సుబ్బారెడ్డి వివరించారు. ఇటీవల ఎక్మో చికిత్స మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఆయువు పోసిందన్నారు. ఎమ్మిగనూరుకు చెందిన బాలగోటి కోట ప్రకాష్‌గౌడ్‌ (51)కు ఫిబ్రవరిలో తీవ్రమైన గుండెపోటుతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారన్నారు. ఆయన గుండె బలహీనపడటంతోపాటు రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, మూత్రపిండాలతో సహా ఇతర అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో పరిస్థితి విషమించిందన్నారు. యాంజియోప్లాస్టీ కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిందని, దీంతో కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్‌ను సంప్రదించడంతో డాక్టర్‌ నిరంజన్‌ పాణిగ్రాహి నేతృత్వంలో మొబైల్‌ ఎక్మో బృందం కర్నూలుకు చేరుకుని ప్రకాష్‌గౌడ్‌కు చికిత్స చేశారన్నారు. కాస్త కుదుటపడ్డాక హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించి పూర్తిస్థాయి వైద్యం చేయడంతో ఆయన కోలుకున్నారని వివరించారు. ఇలాంటి సంఘటనల్లో చాలా మందికి ఎక్మో చికిత్స అందించడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

కుందూలో పడి బాలుడి మృతి

బండిఆత్మకూరు: కాకనూరు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు కుందూనదిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చెవిటి ఈశ్వరమ్మ, నాగార్జున దంపతుల కుమారుడు నాగచరణ్‌ ఆదివారం ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలో అన్నిచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో కుందూనదిలో గాలించగా మృతదేహం లభించింది. ఈతకెళ్లి నీట మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement