మంత్రాలయం: చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల తరపున నిరంతరం పోరాడతామని, కార్యకర్తలకు అండగా నిలుస్తామని మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావించడం మాని, నాలుగు గ్రామ పంచాయతీలు, 3 ఆవాస గ్రామాల గురించి ఆలోచించడం శోచనీయమన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన నా గ్రామాలకు మంత్రులను పంపించే వరకు దిగజారడం చూస్తే నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదన్నారు. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే ఏడు గ్రామాల్లో 8వేల మంది ఓటర్లు ప్రజా తీర్పును నిర్ణయిస్తారన్నారు. బీసీల ప్రభుత్వం అంటున్నావే, ఏ ఒక్క వాల్మీకి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చావా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు, అన్ని రంగాల్లో కులమతాలకు అతీతంగా మంత్రి పదవులు కేటాయించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేతనైతే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు పట్టుకొని సచివాలయాల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. రెండు సంవత్సరాల్లో ఉచిత సిలిండర్లు తూతూమంత్రంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇచ్చేలోపు కూటమి ప్రభుత్వం ముగుస్తుందన్నారు. గురురాఘవేంద్ర పంపు హౌస్‌లో దొంగలు మోటార్లను ఎత్తికెళ్ళినా పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి ఈరన్న, కోసిగి ఎంపీపీ ఈరన్న, కౌతాళం మండల కన్వీనర్ ప్రహ్లాద ఆచారి, ఎల్‌ఎల్‌సీ డిస్టిబ్యూటర్ మాజీ అధ్యక్షులు ఐరన్‌గల్ శ్రీనివాసరెడ్డి, లీగల్‌సెల్ స్టేట్ జాయింట్ కార్యదర్శి గురురాజరావు పాల్గొన్నారు.


