● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): వ్యక్తిగత దూషణలతో పాటు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో పార్టీ శ్రేణులతో కలిసి శనివారం ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎస్వీ మాట్లాడుతూ.. ఒక ప్రజాప్రతినిధిగా హుందాగా ఉండాల్సిన పంతం నానాజీ అనుచితంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో విద్వేషాలు, ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 2023 నిబంధల ప్రకారం ఎమ్మెల్యేతో పాటు వీడియోలు పోస్టు చేసి, ప్రచారం చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లిఖిత పూర్వకంగా ఫిర్యాదు
● మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని మాజీ ఎంపీపీ కేశన్న డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు సీఐ కంబగిరి రాముడును కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య. వక్ప్‌బోర్డు మాజీ ఉపాద్యక్షులు రియాజ్ అహమ్మద్, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచానీ వెంకటేష్ పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని ఆలూరు వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆలూరులో ఎస్‌ఐ మన్మథ విజయ్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీసీ సెల్ జిల్లా కార్యదర్శి భాస్కర్, మండల కన్వీనర్ మల్లిఖార్జున, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


