ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో శనివారం జరిగిన టోల్ గేట్ నిర్వహణ వేలం పాటలో టీడీపీ నాయకుల పథకం పారింది. నాయకులందరూ సిండికేట్‌గా మారి నిబంధనలు అతిక్రమించారు. వాహనాల గేట్ (టోల్ గేట్) వసూలు చేసుకునే హక్కుకు సంబంధించి 2026–27 సంవత్సరానికి నిర్వహించిన వేలంలో అధికారుల తీరుపై పాటదారులు మండిపడుతున్నారు. నాయకులందరూ సిండికేట్‌కు ఒప్పుకోగా అందుకు పోలీస్, పంచాయతీ అధికారులు సైతం తన వంతు సహకారం అందించారు. అహోబిలం టీటీడీ కల్యాణ మండపంలో వాహనాల గేట్ (టోల్ గేట్) వసూలు చేసుకునే హక్కుకు సంబంధించి శనివారం డీఎల్‌పీఓ రాంబాబు అధ్యక్షతన వేలం పాటలు నిర్వహించారు. రూ 21,33,550తో వేలం ప్రారంభించగా రూ 25,04,000 సానే సురేష్ అనే వ్యక్తి పాట దక్కించుకున్నారు. పది రోజులుగా గ్రామ నాయకుల మధ్య పంచాయతీ, పోలీస్ అధికారులతో జరిగిన చర్చలో ఎట్టకేలకు రూ. 25 లక్షలకు వేలం పాట పాడినట్లు నటించి రాసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రూ. 25 లక్షలు రౌండ్ ఫిగర్ బాగుండదని, రూ.25,02,000 వరకు పాడినట్లు చేసి ముందే ఒప్పందం చేసుకున్న వ్యక్తి పేరుపై పాట నిలిపేయాలని, ఈ మేరకు ఎవరూ ఎక్కువ వేలం పాడకూడదని అనధికారిక ఒప్పంద పత్రం కూడా రాసుకున్నట్లు సమాచారం. అయితే పాట జరిగే సమయంలో టీడీపీలోని మరో వర్గం నాయకుడు గూడూరు సంజీవరాయుడు ఉన్నట్టుండి వేలం పాటలో రూ. వెయ్యి పెంచి రూ. 25,03,000కు పాట పాడటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతలో తేరుకుని పక్కనున్న రమణ రూ.30 లక్షలు అంటుండగానే అక్కడే ఉన్న మరో తెలుగు తమ్ముడు అతని నోరు గట్టిగా అదిమిపట్టి మేం మాట్లాడుతాం.. పాడొద్దని చెప్పడం.. ఇదంతా పోలీసులు, అధికారుల ముందే జరగడం గమనార్హం. ఎట్టకేలకు మరో రూ. వెయ్యి పెంచి రూ. 25,04,000కు ముగిసేలా టీడీపీ నేతలు చక్రం తిప్పడంతో అధికారులు, పాటదారులు ఊపిరి పీల్చుకున్నారు.
అడుగడుగునా అనుమానాలే..
అహోబిలం గేటు వేలం బహిరంగంగానే అంటూ చివరకు అధికారులు, పోలీసుల రహస్యంగా మారిపోయింది. వేలం పాటలో పాల్గొనేందుకు రెండు మూడు రోజుల నుంచి డబ్బులు సిద్ధం చేసుకుని పాట పాడేందుకు వచ్చిన ఇద్దరు మహిళలను గేటు బయటే నిలబెట్టడం ఆశ్చ్యరానికి గురి చేసింది. మరో టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి వేలం పాటలో పాల్గొనేందుకు తన అనచరులతో పాటు ఓ న్యాయవాదిని సైతం వెంటపెట్టుకుని వస్తుండగా పోలీసులు ఆయనను గేటు దగ్గరే అడ్డుకుని వెనక్కి పంపారు. గ్రామస్తులు తప్ప ఇతరులు పాల్గొనేందుకు అవకాశం లేదని అధికారులు సూచించడంతో గ్రామానికి చెందిన వెలంగయ్య, భాస్కర్‌రెడ్డిలతో పాట పాడించాలని న్యాయవాది, అనుచరులను పంపించారు. అయితే అందరిని పోలీసులు వేలం పాట జరుగుతున్న హాలు దగ్గరకు కూడా వెళ్లకుండా ప్రధాన రహదారిలోనే బారికేడ్ల దగ్గరే నిలిపి అక్కడే కూర్చోబెట్టుకున్నారు. వీరినే కాదు కనీసం మీడియాను సైతం అడ్డుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టడంతోనే బహిరంగ వేలాన్ని రహస్య వేలంగా నిర్వహించేందుకు అందరూ ఒక్కటయ్యారని చర్చించుకోవడం గమనార్హం. ఈ విషయంపై డీఎల్‌పీవో రాంబాబును వివరణ కోరగా.. గ్రామ సభ సూచనల మేరకు గ్రామస్తులు తప్ప ఇతర ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన కూడదన్న నిబంధన మేరకే వేలం పాటలు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే గ్రామస్తులను బయట నిలిపేసినట్లు తమకు తెలియదన్నారు.
అహోబిలం టోల్‌గేట్ వేలం పాటలో
సిండికేట్ మాయ
అధికారులు, పోలీసుల సహకారంతో
ఫలించిన టీడీపీ నేతల పథకం
నిర్ణయించిన ధరకే వేలం దక్కేలా
చక్రం తిప్పిన తమ్ముళ్లు
పాటదారులను అడ్డుకున్న అధికారులు


