బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం పురస్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, చెల్లించి మహామంగళహారతి నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు తీసుకున్నారు.
పారా రోయింగ్‌లో ప్యాపిలి యువకుడి ప్రతిభ
ప్యాపిలి: పట్టణానికి చెందిన కొంగనపల్లి వెంకటనారాయణ పారా రోయింగ్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ నెల 24 నుంచి 27 వ తేదీ వరకు పూణెలో జరిగిన అండర్ 23 నేషనల్ పారా రోయింగ్ చాంపియన్ షిప్‌లో సింగిల్స్ విభాగంలో నారాయణ తన సత్తా చాటుకున్నాడు. 26వ తేదీన జరిగిన పోటీల్లో రెండు కిలోమీటర్ల దూరాన్ని 8.20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నాడు. 27వ తేదీ జరిగిన పోటీల్లో రెండు కిలో మీటర్ల దూరాన్ని 6.49 నిమిషాల వ్యవధిలో చేరుకున్నాడు. ప్రతిభ చాటుకున్న నారాయణ బంగారు పతకాన్ని సాధించాడు.
రూ.700 కోట్ల రుణాల
పంపిణీ లక్ష్యం
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రూ.700 కోట్ల కొత్త రుణాలు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించామని చైర్మన్ డి.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం డీసీసీబీ బోర్డు సమావేశం మహాజనసభ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1.84 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు చైర్మన్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి డీసీసీబీ ద్వారా అన్నివిధాల సహకరిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 39 సంఘాలు మాత్రమే డీసీసీబీ నుంచి రుణాలు పొందేందుకు అర్హత పొందాయని, మిగిలిన సంఘాలు కూడా రికవరీ పెంచుకొని బడ్జెట్ పొందేందుకు అర్హత పొందాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీసీసీబీ సీఇవో పి.రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఇన్‌చార్జీ డీసీవో చెన్నమ్మ, నంద్యాల డీసీవో ఎన్.రామాంజనేయులు, ఆప్కాబ్ ప్రతినిధి లావణ్య, డీసీడీఎం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.


