తరగతి భవనాల పూర్తికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

తరగతి భవనాల పూర్తికి చర్యలు

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

జేడీ మువ్వా రామలింగం

ఎమ్మిగనూరుటౌన్‌: పాఠశాలల్లో రెండవ విడత నాడు – నేడు కింద చేపట్టిన తరగతి గదుల నిర్మాణాల పూర్తికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మనబడి మన భవిష్యత్‌ ఇన్‌ఫ్రా జేడీ మువ్వా రామలింగం అన్నారు. శనివారం పట్టణంలో 3,500 మంది విద్యార్థినులతో నిర్వహిస్తున్న మాచాని సోమప్ప జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను డీఈఓ సుధాకర్‌, సమగ్రశిక్ష ఏపీసీ లోకరాజ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఓ వ్యాపారవేత్త నిర్మిస్తున్న 8 తరగతి గదుల నిర్మాణాలతో పాటు గతంలో అసంపూర్తిగా వున్న గదులను, నిరుపయోగంగా వున్న ఆర్‌ఓ ప్లాంట్‌, పెచ్చులుడిన గదులు, ప్రస్తుతం వున్న మరుగుదొడ్ల సమస్య గురించి తరగతుల్లో విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెయ్యి మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 60కి పైగా వుండగా అందులో కర్నూలు జిల్లాలోనే 20 వున్నాయన్నారు. ఈ జిల్లాలో 67 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వున్నారని తెలిపారు. అసంపూర్తి గదుల నిర్మాణాలకు దాతల సహకారం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ రాజేంద్రప్రసాద్‌, స్థానిక పలు మండలాల ఎంఈఓలు ఆంజనేయులు, మధుసూదన్‌రాజు, రామాంజనేయులు, నీలకంఠ, గోవిందుడు, రఘునాథ్‌, నాగభూషణం, సమగ్ర శిక్ష ఏఈ మురళి, పాఠశాల హెచ్‌ఎం దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement