పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

కర్నూలు(హాస్పిటల్‌): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టరేట్‌ వద్ద జేసీ నూరుల్‌ ఖమర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి కర్నూలు మెడికల్‌ కాలేజీ వరకు ర్యాలీ సాగింది. డీఐఓ డాక్టర్‌ ఉమ, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రఘు పాల్గొన్నారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు

రెండు పోలియో చుక్కలతో పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడుకోవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌ అన్నారు. శనివారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అరబ్‌ దేశాల నుంచి ఎక్కువ మంది భారతదేశానికి వచ్చేస్తుండటం, పక్క దేశాలైన పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఇంకా పోలియో కేసులు ఉండటంతో మన దేశ వ్యాప్తంగా ఈ నెల 28న జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు 3,52,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. మొద టి రోజు 28న పోలియో బూత్‌లలో, ఆ రోజు బూత్‌ల కు రాని వారికి ఇంటింటికి వెళ్లి 29, 30వ తేదీల్లో వేస్తామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమ మాట్లాడుతూ జిల్లాలో 1,630 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాన్ని జిల్లాలో రాష్ట్ర పరిశీలకులుగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ వాసు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి ప్రకాష్‌రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement