నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తేనే హాల్ టికెట్
బకాయి ఫీజు కట్టండి..
● మెస్ బకాయిలు కడితేనే పరీక్షలకు అనుమతి ● పీజీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకుఆర్‌యూ అధికారులు నోటీసులు ● నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ● ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయని కూటమి ప్రభుత్వం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. విద్యార్థుల అత్యుత్సాహం, అధికారుల పంతాలు వెరసి విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం, కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు వర్సిటీ ప్రతిష్టను మసక బార్చేలా మారుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం వర్సిటీ పునః ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. వర్సిటీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మెస్ బిల్లుల బకాయిలు కట్టకపోవడంతో అధికారులు భోజనం పెట్టకుండా నిలిపేశా రు. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉందని, దాని గురించి ఆలోచించకుండా వెనుకబడిన ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులను కక్ష పూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. వర్సి టీ అభివృద్ధికి వాడాల్సిన ఇంటర్నల్ ఫండ్స్‌ను వర్సిటీ అభివృద్ధికి వాడకుండా ఉద్యోగులకు జీతాలు అయితే చెల్లిస్తారు కానీ విద్యార్థులు మెస్ ఫీజులు కట్టలేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీ అధికారులేమో మెస్ బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లను నిర్వహించగలమని చెబుతున్నారు.
నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు
వర్సిటీ పరిధిలో పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ 472 మంది, సప్లిమెంటరీ 33 మంది విద్యార్థులు వర్సిటీ కళాశాల కేంద్రంతో పాటు నంద్యాల, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
అధికారులు చెబుతున్న బకాయిల లెక్కలు ఇలా..
● పీజీ రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన బకాయి రూ. 20.70 లక్షలు
● విద్యార్థులు కట్టిన బకాయి రూ. 11.03 లక్షలు
● ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ. 9.66 లక్షలు
● ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్
మెంట్ రూ. 6.20 లక్షలు
● రీయింబర్స్ పోగా ఇంకా విద్యార్థులు
కట్టాల్సింది రూ.2.64 లక్షలు
రాయలసీమ యూనివర్సిటీ పరిపాలన భవనం
వర్సిటీలో నోటీసుల జారీతో కలకలం
హాస్టల్ బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటేనే హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు రాయనిస్తామని వర్సిటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వని ఏ ఒక్క విద్యార్థికై నా హాల్ టికెట్లు జారీ చేయొద్దని అన్ని డిపార్ట్‌మెంట్ల హెచ్‌ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నో డ్యూస్ నోటీస్‌తో వర్సిటీలో కలకలం రేగుతోంది. గత పది రోజుల నుంచి వర్సిటీలో హాస్టళ్ల బకాయిల గురించి ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసి హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాట కేసు నమోదైంది. వీరిలో నలుగురు విద్యార్థులు నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. గతంలో ఇద్దరు విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, ఒక విద్యార్థిపై కేసు నమోదు కావడం జరిగింది. వీరు ఇద్దరు సైతం పరీక్షలు రాయాల్సి ఉంది. వర్సిటీలో ఇలాంటి పరిణామాలు తరచూ చోటు చేసుకోడం పట్ల విద్యా వేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఎక్కడో ఒక చోటు పుల్‌స్టాప్ పడకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నాశఽనం కావడంతో పాటు వర్సిటీ ప్రతిష్ట దిగజారిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హాస్టళ్ల మెస్ బకాయిలు చెల్లించాక నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తేనే హాల్ టికెట్స్ ఇచ్చి పరీక్షలకు అనుమతిస్తాం. కొంత ఫీ రీయింబర్స్ మెంట్ రావాల్సి ఉంది. అది కాక ఇంకా సుమారు రూ. 2 లక్షల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు మెస్ బిల్లులు క్లియర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాస్టళ్ల నిర్వహణ సులభమవుతుంది. బకాయిలు పేరుకుపోతే నిర్వహణ కష్టమవుతుంది. కొంత మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్ వచ్చినా కట్టకపోవడం బాధాకరం. పరిస్థితులను అర్థం చేసుకొని విద్యార్థులు బకాయిలు చెల్లించి సహకరించాలి. – డాక్టర్ విజయ్‌కుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్‌యూ


