ఖరీఫ్‌ ఆశలు కరిగిపోతున్నాయ్‌..! | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ ఆశలు కరిగిపోతున్నాయ్‌..!

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు

ఇప్పటి వరకు 1.08 లక్షల హెక్టార్లలో పంటల సాగు

అత్యధికంగా 95 వేల హెక్టార్లలో పత్తి సాగు

వర్షాలు లేక రైతుల్లో ఆందోళన

కర్నూలు(అగ్రికల్చర్‌): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఖరీఫ్‌ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రెండు వారాలుగా వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. వర్షాలు తగ్గిపోగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలి తీవ్రత ఎక్కువైంది. దీంతో నేలలోని తేమ త్వరగా ఆవిరై పోతోంది. ఈ నెల మొదటి 10 రోజుల్లో ఆశాజనంగా వర్షాలు పడటంతో మొన్నటి వరకు ఖరీఫ్‌ పంటల సాగు జోరుగా సాగింది. దీంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అయితే పలు మండలాల్లో అంతంత మాత్రం తేమలో విత్తనం వేయడం వల్ల మొలకలు రాక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌ సీజన్‌ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా... ఇప్పటి వరకు 1,08,349 హెక్టార్లలో సాగు అయ్యాయి. ఇందుల్లో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. జిల్లాలో కంది 5,990 హెక్టార్లు, వేరుశనగ 4,938, ఆముదం 1,970, సజ్జ 285, మొక్కజొన్న 93, కొర్ర 63 హెక్టార్ల ప్రకారం సాగు అయ్యాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకమైంది. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 99 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతంలో 90 శాతం ఈ నెల 10వ తేదీలోపే నమోదైంది. అంటే రెండు వారాలకుపైగా వర్షాలు లేవు. ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమై ఖరీఫ్‌ సాగుతుందా అనే అనుమానం రైతుల్లో నెలకొంది.

పత్తిని కాపాడుకునేదెలా....!

పత్తి సాగు చేయాలంటే కనీసం 75 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అప్పుడే విత్తనానికి తగిన తేమ ఉంటుంది. నెల మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. అయితే నల్ల రేగడి నేలల్లో అంతంత మాత్రం తేమలోనే పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల దాదాపు 25 వేల హెక్టార్లలో మొలకలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. 50 శాతం కూడా విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. పత్తి ప్రధానంగా ఆదోని, పెద్దకడుబూరు, మంత్రాలయం, హొళగుంద, దేవనకొండ, ఆస్పరి, మద్దికెర, పత్తికొండ, సీ.బెళగల్‌, హాలహర్వి, కల్లూరు మండలాల్లో ఎక్కువగా సాగైంది. ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలో అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో ఇది వరకు సాగు చేసిన పత్తిని ఎలా కాపాడుకోడం ఎలా.. అనేది ప్రశ్నార్థకమైంది. నీటితడి ఇచ్చేందుకు కాలువల్లో చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటకు బిందు సేద్యం సదుపాయం కల్పించుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయితే సూక్ష్మ సేద్యం మంజూరు ప్రక్రియను ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement