కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యకేత్రం అయిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో వందేళ్ల నాటి ఆచారం కొనసాగింది. మొహర్రం పండుగకు ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలోని పీర్ల దేవుడు మొహర్రం పదవ రోజు (సహదత్) తెల్లవారుజామున ఈరన్న స్వామి దేవాలయంలోకి ఊరేగింపుగా చేరుకుంటారు. పీర్ల దేవుడిరాకతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ కొనసాగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఈ సంప్రదాయం కొనసాగింది. పీర్ల దేవుడు దేవాలయం వద్దకు చేరుకోగానే కోలాహలం మొదలైంది. పీరును ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకులు పూజలు చేసి హారతి పట్టారు. సంప్రదాయ వేడుకను భక్తులు కనులారా తిలకించారు.
పాతాళగంగలో గుర్తు తెలియని మృతదేహం
శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని పాతాళగంగలో శుక్ర వారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు వన్‌టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా అతని ప్యాంటు జేబులో రేపల్లె – గుంటూరు బస్ టికెట్ లభించిందన్నారు. మృతుని చొక్కాపై డీసెంట్ టైలర్స్ అని లేబుల్ ఉందని, మరే ఇతర ఎటువంటి ఆధారాలు లభించ లేదని తెలిపారు. మృతుడు రేపల్లెకు చెందిన వ్యక్తిగా భావించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9121101192, 9121110 1193కు సమాచారం ఇవ్వాలన్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మైనార్టీ కాలనీ రోడ్డు ప్రాంతంలో కె.శ్రావ్య అనే మహిళకి చెందిన టాటా టియాగో ఈవీ కారు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. తమ ఇంటి ముందు ఉంచగా శుక్రవారం తెల్లవారుజామున కారులో మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపులో తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.


