ఆటో, బైక్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్‌ ఢీ

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

● యువకుడి పరిస్థితి విషమం ● పోలీసుల అదుపులో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు డ్రైవర్లు

ఆదోని రూరల్‌: గణేకల్‌–పాండవగల్‌ గ్రామాల మధ్య ఉన్న పాతరయ్యస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆటో, బైక్‌ ఢీకొన్నాయి. ఓ యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్దతుంబళం ఎస్‌ఐ విద్యశ్రీ తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నెమలికల్లు గోవిందు ప్రయాణికులతో మాధవరం నుంచి ఆదోనికి వస్తుండగా, గణేకల్‌ గ్రామానికి చెందిన అయ్యన్న బైక్‌పై పాండవగల్లు వైపు వెళ్తుండగా పాతరయ్య దేవాలయ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయ్యన్న(26) తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు వన్నూర్‌బీ, రెహానా, అయసూన్‌బీలకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యశ్రీ తెలిపారు.

మద్యం మత్తులో బస్సు నడుపుతూ..

పత్తికొండ: ఫూటుగా మద్యం సేవించి అతివేగంగా ప్రైవేటు బస్సు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్తికొండ సీఐ జయన్న, ఆదోని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ దీప్తి శిశిర శుక్రవారం రాత్రి పత్తికొండ పట్టణ శివారులోని హోసూరు బైపాస్‌ దగ్గర బస్సు ఆపి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...శుక్రవారం సాయంత్రం మంత్రాలయం నుంచి బెంగళూరుకు శ్రీగురు ట్రావెల్స్‌ బస్సు బయలుదేరింది. మంత్రాలయం నుంచే వేగంగా, అడ్డదిడ్డంగా బస్సు నడుపుతూ ప్రయాణికులను బెంబేలెత్తించారు. పలువురు ప్రయాణికులు భయపడి వెంటనే 100కు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పత్తికొండ పోలీసులను, ఆదోని ఆర్‌టీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సును వెంబడించి పత్తికొండ పట్టణ శివారులో నిలిపివేశారు. అనంతరం బస్సు డ్రైవర్లకు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా అతిగా మద్యం తీసుకున్నట్లు వెల్లడైంది. వెంటనే కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులను ఇతర బస్సులలో బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement