పాములపాడు: గుంటూరు నుంచి కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇవ్వడానికి వస్తున్న ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంఘటన శుక్రవారం కర్నూలు – గుంటూరు హైవేలో యర్రగూడరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు సొనాలిక షోరూం నుంచి నాలుగు ట్రాక్టర్ ఇంజిన్లు కర్నూలు జిల్లా ఆదోనిలో డెలివరీ ఇచ్చేందుకు డ్రైవర్లు బయల్దేరారు. మార్గమధ్యలో యర్రగూడూరు సమీపంలో కుక్క అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో ఓ ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన డ్రైవర్ తిరుపతయ్య(33) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంట వచ్చిన మరో ట్రాక్టర్ ఇంజిన్ డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.
గుర్తు తెలియని
వ్యక్తి ఆత్మహత్య
కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్‌లో డౌన్ లైన్ ట్రాక్‌పై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని, ఎడమ చేతిపై ‘అమ్మ ’అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఆకుపచ్చని ఫుల్ టీషర్ట్, గులాబీ, నలుపు, తెలుపు రంగుల పూల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉందని, మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్లు ఆదో ని రైల్వే స్టేషన్‌లో పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు


