ఆదోని అర్బన్: కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాటును తనకు తెలియకుండా ఇతరులకు అమ్మేసిన వ్యక్తి న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కార్వన్‌పేటకు చెందిన దంపతులు రామచంద్ర, సంధ్య హెచ్చరించారు. ఈ మేరకు వారు గంగపుత్ర సంఘం సభ్యులతో కలసి అక్రమంగా ప్లాట్ అమ్మేసిన వ్యక్తి ఇంటి ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 2014లో నాన్ లేఅవుట్ కింద ఉన్న 348, 349/3 సర్వేలో ఉన్న మూడున్నర సెంట్ల ప్లాట్‌ను శివప్రసాద్ నుంచి కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి ఆ ప్లాట్‌లో బండలు పాతుకుని ఉన్నామన్నారు. అయితే 2025లో లే–అవుట్ చేసి తన ప్లాట్‌ను వేరే వ్యక్తికి అమ్మేయడంపై శివప్రసాద్‌ను నిలదీశామన్నారు. డబ్బులు కానీ, ప్లాట్ కానీ తిరిగి ఇవ్వాలని కోరితే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదన్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు శివప్రసాద్ ఇంటి ముందు ధర్నా కూర్చొంటామని, లేదంటే అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు గంగపుత్ర సంఘం కులస్తులు కోదండ, ప్రకాష్, శ్రీనివాసులు, దీపక్, వీరేష్, వై.పి.నాగరాజ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.


