దా‘రుణాలు’
ట‘మాట’ పడిపోయి..!
కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు ప్రభుత్వంలో రెండేళ్లుగా జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో నూతనంగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. రైతులకు వ్యవసాయం కలసి రాలేదు. ఆర్థిక ఇబ్బందులతో పలు బ్యాంకులు, బీమా కంపెనీలు, హోటళ్లు సరిగ్గా నడవడం లేదు. ఎలాంటి ప్రగతి లేకున్నా జిల్లాలో జీడీవీఏ ప్రస్తుత ధరల ప్రకారం రూ.50,339 కోట్ల ఉందని జొన్నగిరికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు జిల్లా అధికారులు ఉంచారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా గ్రాస్ డెవలప్‌మెంటు వాల్యు (జీడీవీఏ) లెక్కిస్తారు. వ్యవసాయ రంగం ద్వారా రూ.16,596 కోట్లు, పారిశ్రామిక రంగం ద్వారా రూ.9948 కోట్లు, సేవా రంగం ద్వారా రూ.23,795 కోట్లు జీవీఏ సాధించినట్లు లెక్కలు చూపారు.
వ్యవసాయ రంగం కుదేలు
అధిక వర్షాలతో 2025–26లో వ్యవసాయ, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉత్పాదకత పూర్తిగా పడిపోగా పంటలకు ధరలు కూడా లేవు. జిల్లాలో 2024–25లో వ్యవసాయ రంగం జీవీఏ రూ.18,164 కోట్లు ఉండగా 2025–26లో రూ.16,596 కోట్లకు పడిపోయింది. అంటే జీవీఏ రూ.1568 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైనట్లు జిల్లా యంత్రాంగం ఇచ్చిన లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.
ఉత్తుత్తి ఉత్పత్తి!
పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే 2025 ఖరీఫ్‌లో పండించిన టమాట మార్కెట్‌లోకి వచ్చే నాటికి ఈ పరిశ్రమ సిద్దం కావాలి. 2026 ఖరీఫ్‌లో పండించిన టమాట మార్కెట్‌లోకి వచ్చే నాటికి కూడా సిద్ధమయ్యే అవకాశం లేదు. ఎమ్మిగనూరు మండలంలో టెక్స్‌టైల్ పార్క్‌కు భూమి పూజ చేయడం తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. కాని పారిశ్రామిక రంగంలో అద్భుతమైన స్థూల ఉత్పత్తి సాధించినట్లు లెక్కలు వేశారు. 2025–26లో జిల్లాలో పారిశ్రామిక రంగం ద్వారా జీవీఏ రూ.9,948 కోట్లు ఉన్నట్లు లెక్కలు వేశారు.
సేవలు అంతంతమాత్రమే!
సేవా రంగంలోకి బ్యాంకులు, బీమా కంపెనీలు, హోటళ్లు తదితరవన్నీ వస్తాయి. సేవలకు విలువ కట్టి జీవీఏ లెక్కిస్తారు. 2025–26లో జిల్లాలో సేవా రంగం ద్వారా జీవీఏ రూ. 23,795 కోట్లు సాధించినట్లు లెక్కలు చూపుతుండటం పట్ల నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2025–26లో పశ్చిమాసియా యుద్ధం కారణంగా సేవారంగం కుదేలెంది. కాని సేవా రంగం 2024–25తో పోలిస్తే ప్రగతి సాధించినట్లు లెక్కలు చెబుతుండటం గమనార్హం.
అంకెల గారిడీ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023–24లో కర్నూలు జిల్లా స్థూల ఉత్పత్తి రూ.46,010 కోట్లు ఉంది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైన తర్వాత 2024–25లో సంక్షేమం, అభివృద్ధి లేదు. అయినా రూ. 52,762 కోట్లకు పెరిగినట్లు లెక్కలు ఉన్నాయి. 2025–26లో జిల్లా స్థూల ఉత్పత్తి అమాంతం రూ.54,607 కోట్లకు చేరినట్లు అంకెల గారిడీకి చేశారు. అలాగే జిల్లా తలసరి ఆదాయం 2023–24లో రూ.1,70,304 ఉన్నట్లు తాజాగా లెక్కలు వేశారు. ఈ తలసరి ఆదాయం 2024–25లో రూ.194,723కు చేరినట్లు లెక్కలు వేశారు. 2023–24తో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి లేనే లేదు. కాని తలసరి ఆదాయం మాత్రం గణనీయంగా పెరగడం చంద్రబాబు ప్రభుత్వ అంకెల గారిడీ మహిమగా చెప్పవచ్చు. 2025–26లో తలసరి ఆదాయం మరింత పెరిగినట్లు లెక్కలు వేశారు. తలసరి ఆదాయం 1,94,723 నుంచి 2,00,522కు చేరినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. తలసరి ఆదాయంలో కర్నూలు జిల్లా 24వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా రూ. 2,27,054లతో 20వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజలకు ఆదాయం బాగుందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా.. ఈ నెల 18న డోన్ పట్టణంలో వ్యాపారి శ్రీనివాసులశెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ‘వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.. బతకలేం.. ఆదుకోండి’ అంటూ సూసైడ్‌నోట్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నవించుకున్నారు. దా‘రుణాలు’ జరుగుతున్నా తలసరి ఆదాయం పెరిగినట్లు చూపడంపై విమర్శలు వస్తున్నాయి.
పొలంలోనే టమాటాలను వదిలేసిన దృశ్యం పెద్దకడబూరులో ఏప్రిల్ నెలలో కనిపించింది. రెతుల పరిస్థితిని తెలుసుకుని పత్తికొండలో నిర్మాణంలో ఉన్న టమాట ప్రాసెసింగ్ యూనిట్ పనుల పురోగతిపై ఉన్నతాధికారులు ఈ నెలలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును మూడు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదు.
రెక్కల కష్టం మట్టిపాలు
వర్షాలు లేక మిరప పైరును మొలకదశలోనే ట్రాక్టర్‌తో దున్నేస్తున్న ఈ దృశ్యం నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో కనిపించింది. నలభై రోజులకు పూత, పిందె రావాల్సి ఉండగా వర్షాలు సరిగా కురవక పోవడంతో మొక్కల్లో ఎదుగుదల తగ్గింది. మొక్కలకు బింగి తెగులు సోకడంతో వాటిని ట్రాక్టర్లతో దున్నేశారు. ఒక్కో ఎకరానికి రూ.50వేల వర కు రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వ్యవసాయం బాగుందని, అబద్ధాల లెక్కలు చూపిస్తోంది.


