‘పచ్చ’నోట్లకు రిజిస్ట్రేషన్‌ ! | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’నోట్లకు రిజిస్ట్రేషన్‌ !

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

దొడ్డనగేరిలో జెడ్పీ హైస్కూల్‌ స్థలం కబ్జా

కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌

గ్రామ కంఠం భూమి అని బుకాయింపు

రిజిస్ట్రేషన్‌లో వారసత్వంగా నమోదు

ఏ స్థాయిలోనూ అడ్డుకోని అధికారులు

పాఠశాల స్థలం కబ్జా చేసినా ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు. రోజు పాఠశాలకు వెళ్లే ప్రధానోపాధ్యాయుడు కూడా చూసీచూడనట్లు వదిలేశాడు. రెవెన్యూ అధికారులు తమకెందుకని మిన్నకుండిపోయారు. రిజిస్ట్రేషన్‌ సమయంలోనైనా అడ్డుకోవాల్సిన సబ్‌ రిజిస్ట్రార్‌ కళ్లకు నోట్ల కట్టలు అడ్డురావడంతో ఏకంగా దాన విక్రయానికి ‘పచ్చ’జెండా ఊపేయడం గమనార్హం. ఏ స్థాయిలోనూ ఎవ్వరూ అడ్డు చెప్పకపోవడంతో పిల్లల ఆటస్థలం ఓ టీడీపీ నేత కుటుంబ పరమైంది.

ఆదోని: మండల పరిధిలోని దొడ్డనగేరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు సంబంధించి సర్వే నంబర్‌ 101లో 4.21 ఎకరాల భూమి ఉంది. ఇందులో 11.38 సెంట్ల భూమిని స్థానిక టీడీపీ మండల నాయకుడు కురువ శివప్ప ఆక్రమించాడు. ఆ తర్వాత ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తన పలుకుబడిని, నోట్ల కట్లను ఉపయోగించి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌(రిజిస్ట్రేషన్‌ నంబర్లు: 22567/2024, 14107/2024, 20702/2024) చేయించాడు. అది కూడా తన మనవళ్లు, తన అన్న కుమారుల పేరిట దాన విక్రయం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామస్తులు కొందరు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత ఆదివారం పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్‌, ప్రధానోపాధ్యాయుడు మూడో కంటికి తెలియకుండా పాఠశాల స్థలాన్ని కొలతలు వేసినట్లు తెలుస్తోంది.

ఖాళీ స్థలానికి పన్ను చెల్లించారట!

సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో అధికారులు ఏ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌ చేయాలన్నా లింకు డాక్యుమెంట్లను పరిశీలించడం పరిపాటి. అయితే టీడీపీ నేత పాఠశాల స్థలాన్ని దాన విక్రయం చేసిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో ఒక్కదానికీ లింకు డాక్యుమెంట్‌ లేకపోవడం గమనార్హం. దొడ్డనగేరి గ్రామ పంచాయతీలో తన ఖాళీ స్థలం మీద అసెస్‌మెంట్‌ నెం.550 మీద పన్ను చెల్లిస్తునట్లు 2024 నాటి రసీదులతో అధికారులు గుడ్డిగా రిజిస్ట్రేషన్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఖాళీ స్థలాలకు గుత్త వసూలు చేయరనే విషయం సదరు టీడీపీ నేతకు తెలియకపోయినా, సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులు కూడా గుర్తించకపోవడం వారి ధనదాహానికి నిదర్శనం.

పాఠశాల స్థలం

‘దానమిచ్చిన’ టీడీపీ నేత

గ్రామ కంఠం భూమి అయితే కబ్జా చేసుకోవచ్చా!

కబ్జా బాగోతం బయటకు పొక్కడంతో టీడీపీ నేత ఇదంతా గిట్టని వాళ్ల ప్రచారమని చెప్పుకుంటున్నాడు. ఆ భూమి గ్రామ కంఠానికి సంబంధించినదని చెబుతూనే.. రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ‘‘నా పెద్దల వల్ల సంపాదించబడిన నా వారసత్వం’’ అని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. సర్వే నెం.101 గ్రామ కంఠం భూమి అయినప్పుడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎలా దాన విక్రయానికి అంగీకరించారనేది అధికారులకే తెలియాలి. ఇవన్నీ పక్కనపెడితే.. ప్రభుత్వ విద్యా సంస్థకు చెందిన భూమిని ఏకంగా ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది.

గిఫ్ట్‌ డీల్‌ రిజిస్ట్రేషన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement