గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్లలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు బుధవారం రాత్రి భోజనం అనంతరం కుళ్లిన అరటి పండ్లను పంపిణీ చేశారు. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో విద్యార్థినులు తినకుండా పాఠశాల బయట డబ్బాలో పడేశారు. అయితే మొహర్రం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వెళ్లడం, అక్కడ డబ్బాలలో కుళ్లిన అరటి పండ్లను చూసి జరిగిన విషయం తెలుసుకున్నారు. వీటిని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ అవుతోంది. గోనెగండ్ల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం కూడా అందించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేజీబీవీ ప్రిన్సిపాల్ విద్యావతిని ప్రశ్నించగా బుధవారం రాత్రి మంచి అరటి పండ్లనే ఇచ్చామన్నారు.
ట్రిపుల్ ఐటీడీఎంలో సర్టిఫికెట్ ప్రోగ్రాం కోర్సులు
కర్నూలు సిటీ: ట్రిపుల్ ఐటీడీఎంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీపై ఏఐసీటీఈ–క్యూపీ–పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో–ఆర్డినేటర్ నరేష్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్‌ఈ ఫ్యాకల్టీ బోధన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశించిన ప్రోగ్రాంకు వచ్చే నెల 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 200 గంటల వ్యవధితో హైబ్రిడ్ విధానంలో(ఆన్‌లైన్, ప్రత్యక్ష తరగతులు) నిర్వహిస్తామన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో 50 మంది, డ్రోన్ టెక్నాలజీపై 50 మంది అధ్యాపకులకు శిక్షణనిస్తామన్నారు. ప్రత్యక్ష తరగతులకు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఏఐసీటీఈ క్యూఐపీ పోర్టల్ https://qippg.aicte.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.


