సందర్శనీయ స్థలాలు చూసేదెట్టా! | - | Sakshi
Sakshi News home page

సందర్శనీయ స్థలాలు చూసేదెట్టా!

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

రెండు బస్సులు నిరంతరం నడపాలి

శ్రీశైలంటెంపుల్‌: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీశైలం ఆలయంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల సందర్శనకు అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు క్షేత్ర పరిధిలోని సందర్శనీయ స్థలాలను సందర్శిస్తారు. క్షేత్ర పరిధిలోని సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ఆలయాలను సందర్శిస్తారు. ప్రస్తుతం సందర్శనీయ స్థలాలను సందర్శించేందుకు భక్తులు ప్రైవేట్‌ వాహనాలైన జీపులు,ఆ టోలను అశ్రయిస్తూ అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు శ్రీశైలంలో సందర్శనీయ స్థలాల సందర్శనకు సైట్‌ సీయింగ్‌ పేరుతో ఆర్టీసీ బస్సును నడిపేవారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం, శ్రీశైలం డ్యాం తదితర ప్రదేశాలను చూపించి తీసుకువచ్చేవారు. ఇందుకు గాను పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.40 చొప్పున బస్సు చార్జీలు వసూలు చేసేవారు. అప్పట్లో సైట్‌ సీయింగ్‌ బస్సును భక్తులు బాగానే అసక్తి చూపారు. అనంతరం పలువురు భక్తులు సొంత వాహనాలు తెచ్చుకోవడం, ఒక ఫ్యామిలీ మొత్తం ప్రైవేట్‌ వాహనాలైన జీపు, ఆటోలను ప్రత్యేకంగా వారి కోసమే మాట్లాడుకుని తీసుకెళ్లడంతో సైట్‌ సీయింగ్‌ వాహనాలపై ఆదరణ తగ్గిపోయింది. దీంతో రవాణా చార్జీలు భారమవడంతో సైట్‌ సీయింగ్‌ బస్సును తొలగించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

భక్తులపై చార్జీల భారం

మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం సందర్శనీయ స్థలాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ప్రదేశాలను చూపించి తీసుకువచ్చేందుకు క్షేత్రంలో పలు ప్రైవేట్‌ వాహనాలు ఉన్నాయి. జీపులు, ఆటోలు సైట్‌సీయింగ్‌ పేరుతో నడుపుతున్నారు. అయితే ఒక్కో భక్తుడికి రూ.150 నుంచి రూ.200 వరకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో భక్తులపై చార్జీల పేరుతో అదనపు భారం పడుతుంది. సందర్శనీయ స్థలాలు సందర్శించేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ శ్రీశైలంలో సైట్‌ సీయింగ్‌ పేరుతో ఆర్టీసీ బస్సు సర్వీసును నడపాలని భక్తులు కోరుతున్నారు. ప్రేవేట్‌ వాహనాలను అశ్రయిస్తూ జేబులకు చిల్లులు పడుతున్నాయని, ఆర్టీసీ సర్వీసు ఏర్పాటు చేస్తే భద్రతతో పాటు, తక్కువ చార్జీలు ఉండడంతో తమకు వెసులుబాటుగా ఉంటుందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు క్షేత్ర పరిసరాల్లో ఉండే ఉపాలయాలను సందర్శిస్తారు. ప్రైవేట్‌ వాహనాల్లో వెళితే అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దేవస్థాన ట్రస్ట్‌బోర్డు, ఈఓ ప్రత్యేక చొరవ చూపి, ఆర్టీసీ అధికారులతో చర్చించి సైట్‌ సీయింగ్‌ బస్సును పునరుద్ధరించాలి. గంటకు ఒక బస్సు చొప్పున రెండు ఆర్టీసీ బస్సులు నిరంతరం నడపాలి. తద్వారా సామాన్య భక్తులకు ఎంతో వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా భక్తులు ఉపాలయాలను సందర్శిస్తే మరింత అధ్యాత్మికత పెరుగుతుంది. ఆర్టీసీ కాకపోయినా దేవస్థానం అయిన సైట్‌ సీయింగ్‌కు బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలి. – రావిపూడి అశోక్‌కుమార్‌,

కాకుమాను, గుంటూరు జిల్లా

శ్రీశైలంలో పర్యాటక స్థలాల

సందర్శనకు భక్తుల ఇబ్బందులు

కొన్నేళ్ల క్రితం తొలగించిన

సైట్‌ సీయింగ్‌ బస్సు

ప్రైవేట్‌ జీపులు, ఆటోలను

ఆశ్రయిస్తున్న భక్తులు

అధిక చార్జీలతో

భక్తుల జేబులకు చిల్లులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement