తుగ్గలి: బొందిమడుగులలో నవీన్‌కుమార్ రెడ్డి సాగు చేసిన మామిడి, టెంకాయ చెట్ల గుర్తు తెలియని దుండగులు నరికేశారు. కర్నూలుకు చెందిన ఇతను 5 ఎకరాల పొలంలో గత రెండేళ్ల క్రితం మామిడి, టెంకాయ చెట్లును నాటారు. మొక్కలు ఎదుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారు జామున పొలంలోకి చొరబడి చెట్లును కొడవలితో వేరు మొదల్లో నరికి పక్కన పడేసి పోయారు. వ్యక్తిగత కక్షలతో పచ్చని పంటను ధ్వంసం చేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. జరిగిన సంఘటనపై బాధితుడు తుగ్గలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐదు బైకులు దగ్ధం
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రియాంక నగర్ వీధిలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఐదు బైకులను దగ్ధం చేశారు. బాధితులు పవన్‌కుమార్, హబీబుల్లా మాట్లాడుతూ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇళ్ల ముందు వరుసగా నిలిపిన వాహనా లకు నిప్పుపెట్టారన్నారు. భారీగా మంటలు వ్యాపించటంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే బైకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఎవరో ఆకతాయిలు ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు (అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఐదుగురికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పిస్తూ జిల్లాపరిషత్ సీఈఓ జీవీ రమణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి జెడ్పీ చైర్మన్ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకం పొందిన ఐదుగురికి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నియామక పత్రాలను అందించారు. ఉద్యోగాలు పొందిన వారిలో పి.సతీష్ బాబు, కె.గురురాఘవేంద్రను జూనియర్ అసిస్టెంట్లుగా జిల్లాపరిషత్‌కు నియమించారు. అలాగే టైపిస్టులుగా కె.మహబూబ్ బాషాను ఎంపీపీ కోసిగి, బి.విష్ణువర్దన్‌ను పీఆర్‌ఐ సబ్ డివిజన్ ఆలూ రు, యు.లిఖిత రెడ్డిని పీఆర్‌ఐ సబ్ డివిజన్ నంద్యాలకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఆలూ రు ఎంపీపీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న జి.గాదిలింగారెడ్డికి రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి హొళగుంద మండలం ఇంగల్‌దహల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు నియమించారు. అలాగే రికార్డు అసిస్టెంట్/ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్న తి పొందిన పి.సోమశేఖర్‌ను ఎంపీపీ ఉయ్యాలవాడ, ఎన్.పద్మావతిని జెడ్పీహెచ్‌ఎస్ రాజనగరం, పి.శేఖర్‌ను జెడ్పీహెచ్‌ఎస్ పెద్ద హరివాణంకు పోస్టింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.
హత్యకేసులో నిందితుల అరెస్ట్
సి.బెళగల్: పోలకల్ గ్రామంలో పది రోజుల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులోని నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపారు. గురువారం ఆయన కోడుమూరు సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన పులదాసు జగన్ హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి పులదాసు సుశీల ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం గూడూరు మండలం జూలకల్లు గ్రామ శివారులో మహేష్, యోహాన్, దేవరాజు, రాజ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించి వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో సి.బెళగల్ ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


