నీటి ముంపు బాధితుల పరిహారం కేసుల విచారణ
చెక్కులు ఎవరికిచ్చారో అధికారులకు తెలియాలి
కర్నూలు(సెంట్రల్): శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు బాధితుల పరిహారం కేసుల విచారణ గురువారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–4లో లోక్ అదాలత్‌లో చేపట్టారు. డ్యాం నిర్మాణ సమయంలో పగిడ్యాల, కొత్తపల్లి, జూపాడుబంగ్లా మండలాలకు చెందిన దా దాపు 57 గ్రామాల రైతుల భూములు బ్యాక్ వాటర్‌తో నిండిపోయాయి. దీంతో అప్పట్లో ప్రభుత్వం రైతులకు నామమాత్రపు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో కొందరు రైతులు పరిహారం విషయంలో కోర్టుకు వెళ్లారు. దాదాపు 50 ఏళ్ల తరువాత రైతుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఐదేళ్ల క్రితమే అదనపు పరిహారాన్ని మంజూరు చేసింది. అయితే ఎక్కువ మంది రైతులు వ్యక్తి గతంగా కేసులు వేయడంతో వాటిని పరిష్కరించే బాధ్యతను లోక్ అదాలత్ కోర్టులకు అప్పగించారు. 2019 నుంచి విచారణ పూర్తయినా రైతులకు జూలై 11వ తేదీన పరిహారానికి సంబంధించిన చెక్కులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లోక్ అదాలత్ విచారణ చేపట్టింది. అయితే పరిహారాన్ని గతంలో తీసుకున్నట్లు అధికారులు చెప్పడం బాధిత రైతు కుటుంబాలు అవాక్కయ్యాయి. వచ్చిన పరిహారంలోనూ అన్నీ మోసాలే జరుగుతున్నాయని, అధికారులు, దళారులు కలసి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనే కొందరు పరిహారం
తీసుకున్నారన్న అధికారులు
ఆందోళన చెందుతున్న రైతులు
మాకు సంబంధించి సర్వే నంబర్ 575/ఏ లో 1.5 ఎకరాల భూమి నీటి ముంపులో వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి అప్పట్లో అవార్డు 3/77 పాసు చేశారు. ఈ భూమికి సంబంధించి ఇటీవల రూ.14,814 మంజూరైంది. అయితే చెక్కులను 2019 జూలై 10వ తేదీనే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మాకు తెలియకుండా ఎవరికి ఇచ్చారో అధికారులకే తెలియాలి. మరో పొలానికి మంజూరైన పరిహారానికి ఇప్పుడు 15 శాతం లంచం అడుగుతున్నారు. – పింజరి జహరాబీ, ఘణపురం, పగిడ్యాల మండలం


