● పీఆర్ అడిషనల్ కమిషనర్ డా.సుధాకర్‌రావు
కర్నూలు(అర్బన్): స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్దుదామని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ డా.సుధాకర్‌రావు అన్నా రు. గురువారం స్థానిక నందికొట్కూరు రోడ్డులోని ఎస్‌ఎస్ గార్డెన్స్‌లో ‘ ఘన వ్యర్థాల నిర్వహణ – నిబంధనలు ’ అనే అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డీపీఓ, డీడీఓ, డీఎల్‌పీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పీడీఓలకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, తడిపొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో చెత్త నిర్వహణ కార్యక్రమాలను బలోపేతం చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు. షెడ్లలో పరిశుభ్రత, పరికరాల నిర్వహణ, వ్యర్థాల శాసీ్త్రయ ప్రాసెసింగ్‌పై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ జీవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఇళ్ల వద్దే తడి, పొడి వ్యర్థాలను వేరుచేయడం అత్యంత ముఖ్యమన్నారు. వర్క్‌షాప్‌లో ఆదోని డీడీఓ బాలకృష్ణారెడ్డి, కర్నూలు, ఆదోని డీఎల్‌పీఓలు టీ లక్ష్మి, తిమ్మక్క, డీపీఆర్‌సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్ పాల్గొన్నారు.
బ్యాగులో ఆభరణాలు మాయం
ఆదోని అర్బన్: ఓ మహిళ బ్యాగులో రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో వెంటనే ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లతారెడ్డి అనే మహిళ ఆలూరు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం ఎమ్మిగనూరు పట్టణం నుంచి ఆదోని బస్సు ఎక్కింది. ఆదోనిలోని కొత్త బస్టాండులో దిగి ఆటోలో తిమ్మారెడ్డి బస్టాండుకు వెళ్లింది. అక్కడ ఆలూరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా.. కండక్టర్‌కు చూపించేందుకు ఆధార్‌కార్డు కోసం బ్యాగును తెరిచింది. బ్యాగులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బస్సులో, బస్టాండులో వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


