● తనకు సంబంధం లేదంటున్న వీఆర్‌ఓ
మహానంది: సీతారామపురం గ్రామానికి చెందిన కొందరు న్యాయస్థానానికే నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించడం సంచలనంగా మారింది. గ్రామ రెవెన్యూ అధికారి పేరుతో ఫోర్జరీ సంతకం చేసి తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ పత్రాన్ని నంద్యాల కోర్టుకు సమర్పించడం విమర్శలకు దారితీస్తోంది. సాక్షాత్తు న్యాయస్థానానికే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామానికి చెందిన జమాల్ రెడ్డి గురువారం తెలిపిన వివరాల మేరకు.. జమాల్ రెడ్డి ఇల్లు నిర్మించుకుంటున్న నాలుగు సెంట్ల స్థలానికి సంబంధించి ఇటీవల హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 408 లోని 14.50 సెంట్ల స్థలంలో భాగంగా జమాల్ రెడ్డి తనకు ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో పాత ఇంటిని తొలగించి నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పంచాయతీ అధికారులు అనుమతులు లేవన్న పేరుతో షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు జమాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అన్ని అధికారిక పత్రాలను సమర్పించడంతో ఉన్నత న్యాయస్థానం ఆయన అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో సంతృప్తి చెందని మరో వర్గం నేతలు తాజాగా ఈనెల 6వ తేదీన గ్రామ రెవెన్యూ అధికారి సల్మాన్ ఖాన్ పేరుతో ఫోర్జరీ సంతకం చేస్తూ సంబంధిత స్థలంలో గ్రామానికి చెందిన మరికొందరు పొజిషన్‌లో ఉన్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి న్యాయస్థానానికి సమర్పించారు. ఈ విషయంపై వీఆర్‌ఓ సల్మాన్ ఖాన్‌ను సాక్షి వివరణ కోరగా సంబంధిత స్థలానికి సంబంధించి తాను ఎలాంటి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయలేదన్నారు. తన పేరుతో సర్టిఫికెట్ మంజూరు చేయడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


