1,220 మందితో సమావేశం.. 600 మందితో బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

1,220 మందితో సమావేశం.. 600 మందితో బందోబస్తు

Jun 26 2026 6:10 AM | Updated on Jun 26 2026 6:10 AM

ఆ ఏడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం

బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు బలగాలు

మంత్రాలయం: జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంత్రాలయం నియోజకవర్గం మాధవరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం కర్ణాటకలోని హొస్పేట్‌ డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 3.45 గంటలకు మాధవరం గ్రామంలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి సభలో సీఎం ప్రసంగించారు. అయితే పార్టీ సొంత కార్యక్రమమైనా పోలీసుల బందోబస్తు మాత్రం తగ్గలేదు. 1,220 మందితో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, నంద్యాల ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ నేతృత్వంలో అడిషనల్‌ ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు ఇద్దరు, సీఐలు 30, ఎస్‌ఐలు 50 మందితోపాటు 500 మంది కానిస్టేబుళ్లు, 100 మంది ఎపీఎస్పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో బందోబస్తును విమర్శించిన ఇప్పటి టీడీపీ నేతలు, ఈ స్థాయిలో భయాందోళనలకు లోనవుతుండటం చూసి ప్రజలు ముక్కన వేలేసుకుంటున్నారు. ఇది ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారు.

ఆ ఏడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి

మంత్రాలయం మండలంలోని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధీనంలో ఉన్న ఏడు గ్రామాలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అవసరమైతే మంత్రులతో అక్కడ ప్రత్యేక క్యాంపెయినింగ్‌ చేపడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తిక్కారెడ్డికి కనీసం వేదికపై సీటు దక్కకపోవడం గమనార్హం. నాయకులనే కాదు, ఎవరినైనా వాడుకుని వదిలేసే టీడీపీ కరివేపాకు రాజకీయానికి ఇదొక నిదర్శనం.

భక్తుల అవస్థలు

తుంగభద్ర–మంత్రాలయం రహదారిని ఆనుకుని మాధవరంలో సభా వేదిక ఏర్పాటు చేశారు. గురువారం కావడంతో మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో పోలీసులు ట్రాఫిక్‌ పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. తుంగభద్ర రైల్వే స్టేషన్‌కు వెళ్లే భక్తులు నానా అవస్థలు పడ్డారు. భక్తులు ఎంతగా వేడుకున్నా పోలీసులు కనికరించలేదు.

అవసరమైతే మంత్రులు అక్కడే తిష్టవేసి

ఎన్నికలను పర్యవేక్షిస్తారు

మాధవరం కార్యకర్తల సభలో

సీఎం చంద్రబాబు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement