డీసీసీబీలో పదోన్నతులకు ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీలో పదోన్నతులకు ఇంటర్వ్యూలు

Jun 26 2026 6:10 AM | Updated on Jun 26 2026 6:10 AM

వైభవోపేతం.. గరుడోత్సవం అనధికారికంగా నవచండీ యాగం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్‌ ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదవీ విరమణలు చేయడం ద్వారా రెండు ఏజీఎం పోస్టులు, 4 చీఫ్‌ మేనేజర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. మామూలుగా అయితే సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తారు. ఆప్కాబ్‌ కొత్తగా రూపొందించిన సర్వీస్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం అర్హత కలిగిన వారందరితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సర్వీస్‌కు మార్కులు ఉంటాయి. ఇంటటర్వ్యూకు మార్కులు ఉంటాయి. రెండింటి మార్కుల ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తారు. 2 ఏజీఎం పోస్టుల భర్తీకి 20 మంది చీఫ్‌ మేనేజర్లను, 4 చీఫ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి 30 మంది మేనేజర్లను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇంటర్వ్యూలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అయితే ఇంటర్వ్యూ ద్వారా పదోన్నతులు ఎవరిని వరించాయనే వివరాలు తెలియాల్సి ఉంది.

అంబేడ్కర్‌ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం(బాలురు, బాలికలు) మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ కోఆర్డినేటర్‌ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్‌ ర్యాంకు ప్రకారం ఎస్‌సీ–2 బాలికలకు 267–10,000, ఎస్‌సీ–3 వారికి 302 – 14,633, ఎస్‌టీ 947–14,678, బీసీ 02–2999 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. అలాగే ఎస్‌సీ–2 బాలురు 83–9996, ఎస్‌సీ–3 వారికి 3–14,504 వరకు, ఎస్‌టీ 656–14499, బీసీ 10–2500 వరకు మెరిట్‌ జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. బాలికలకు ఈ నెల 27న దిన్నెదేవరపాడులో ఉదయం 8.30 గంటలకు, బాలురకు ఈ నెల 29న చిన్నటేకూరులో ఉదయం 8.30 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 08518–295601 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంతిని పురస్కరించుకుని పెరియాళ్వార్‌ తిరునక్షత్ర వేడుకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి దిగువ అహోబిలంలో గరుడవాహనంపై అధిష్టించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా జ్యేష్ఠాభిషేకం (అభిద్యేయక అభిషేకం) వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో 108 కలశాలతో కూడిన విశేష తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించి జ్యేష్ఠాభిషేకం పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి స్వయం తిరుమేనితో (నిజరూప) దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు.

కొత్తపల్లి: శ్రీశైల దత్తత దేవాలయమైన కొలనుభారతిలో అనధికారికంగా నవచండీ యాగం చేశారని, ఇందుకు సహకరించిన సిబ్బందిపై వేటు వేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన కొంతమంది వ్యక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారుల అనుమతులు లేకుండా కొలనుభారతిలో నవచండీ యాగం నిర్వహించారని తెలిపారు. ఈ విషయం తెలిసి శ్రీశైలం దేవస్థానం ఏఈఓ ఫణిధర్‌ ప్రసాద్‌తో విచారణ జరిపించామని పేర్కొన్నారు. నవచండీ యాగానికి సహకరించిన ఆలయ సిబ్బంది అయిన శివశంకర్‌, కె.తిరుపాలును సస్పెండ్‌ చేశామని వెల్లడించారు. అనధికారికంగా యాగం చేస్తుంటే అధికారులకు సమాచారం ఇవ్వనందుకు పురోహితులు చక్రపాణి శర్మ, శ్రీనివాస శర్మలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పురోహితులపై విచారణ చేసిన పూర్తిగా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. అనుమతులు లేకుండా కొంత మంది నవచండీ యాగం చేస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement