కర్నూలు: మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్‌లో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు.. ఈ మాట విననివారు, ఆ పేర్లు తెలియని వారు అరుదన్నారు. తమాషాగా మొదలై అది లేకుంటే బతకలేమనేంత బానిసలుగా మార్చే శక్తి ఈ మహమ్మారి డ్రగ్స్‌కు ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి మాట్లాడుతూ వివిధ వయస్సుల వారు, రకరకాల స్థాయిల్లో ఉన్న వారు మత్తు పదార్థాల బారిన పడుతున్నారన్నారు. అన్ని రకాలుగా సతమతమవుతూ తమ కుటుంబ సభ్యులకు మనోవేదన మిగులుస్తున్నారన్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా చెలరేగుతోందని ఈగల్ టీమ్ ఆఫీసర్ ఎలీషా అన్నారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక వాల్ పోస్టర్లను జడ్జి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


