● విచారణ జరుపుతున్న
జిల్లా బాలిక సంరక్షణ అధికారి
ఓర్వకల్లు: కొమ్ముచెరువు ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం జరిగింది. పోలీసులు, జిల్లా బాలిక సంరక్షణ అధికారి శారద తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుడుంబాయి తండాకు చెందిన బాలికకు అదే తండాకు చెందిన ప్రసాద్ నాయక్‌తో గురువారం వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొమ్ముచెరువు దేవాలయంలో వివాహం చేసేందుకు సిద్ధం అవగా.. వధువు తరఫున వచ్చిన సమాచారం మేరకు పోలీసులతో జిల్లా బాలికా సంరక్షణ అధికారిణి శారద అక్కడి చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నాయకుల మధ్య వివాహం జరిపించారు. వధూవరులను అధికార పార్టీ నాయకులు ఆశీర్వదించారు. కాగా.. వధువు జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా వాస్తవం బయటకు వచ్చింది. పాఠశాలలో ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం బాలికకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగులో అక్కడి అధికారులు తప్పుడు తేదీతో ఇటీవల జన్మదిన ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇందులో ఏది నిజమైందో అధికారుల పరిశీలనలో తెలియాల్సి ఉంది.


