● మానవ హక్కుల వేదిక నాయకుల
ఆరోపణ
ఆదోని: మాల వీరేంద్ర అదృశ్యం, హత్య కేసు దర్యాప్తు పేరుతో సిట్ పోలీసులు అమానుషంగా వ్యవహరించడం వల్లే బదినేహాల్ గ్రామానికి చెందిన దళిత మహిళ మాల గంగమ్మ మృతి చెందారని మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు ఉరుకుందప్ప, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు నర్సన్న ఆరోపించారు. ముగ్గురు సభ్యులతో కూడిన వాస్తవ నిర్ధారణ బృందం బుధవారం బదినేహాళ్ గ్రామానికి చేరుకొని స్థానికులు, గంగమ్మ కుటుంబ సభ్యులు, కౌతాళం పోలీసులను కలిసి వివరాలు సేకరించింది. అనంతరం గంగమ్మ మృతిపై ఆ బృంద సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం గంగమ్మను, ఆమెతో సహజీవనం చేసే దర్గయ్యను చిత్రహింసలకు గురి చేసిందని ఆరోపించారు. పోలీసులు చెప్పినట్లుగా గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందితే పోస్టు మార్టం ఎందుకు నిర్వహించారు, భారీ పోలీసు బందోబస్తు మధ్య హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్గయ్యను సైతం ఎవరూ కలవకుండా పోలీసులు అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


