మద్యం మత్తులో కిందపడి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కిందపడి యువకుడు మృతి

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

ఎమ్మిగనూరురూరల్‌: ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. పట్టణ ఏఎస్‌ఐ కిష్టప్ప తెలిపిన వివరాలు.. ఎస్సీ కాలనీకి చెందిన లూథర్‌, అనందమ్మకు మాదిగ చిన్న, మాదిగ అభి (19) సంతానం. మద్యానికి బానిసైన అభి రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి అన్నతో గొడవపెట్టుకున్నాడు. ఇరువురిని కాలనీ వాసులు సర్దిచెప్పారు. తర్వాత మద్యం మత్తులో నడుచుకుంటూ బయటకు వెళ్తూ అభి కిందపడిపోయాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బుధవారం ఉదయం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఏఎస్‌ఐ కిష్టప్ప తెలిపారు.

వెలుగోడులో చోరీ

వెలుగోడు: మండలకేంద్రం వెలుగోడులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. గాంధీనగర్‌లో నివసించే ఒంటరి మహిళ దాసరి సుభాషిణి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈనెల 22వ తేదీ ఉదయం కర్నూలుకు చికిత్స కోసం వెళ్లి 23వ తేదీ మధ్యాహ్నం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడిఉండటం, దాచిపెట్టుకున్న రెండున్నర తులాల బంగారు గొలుసు, 5 తులాల వెండి పట్టీలు, రూ.50వేలు నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

వక్కను మింగిన చిన్నారి

ఎండోస్కోపీ ద్వారా

తొలగించిన వైద్యులు

కర్నూలు (హాస్పిటల్‌): ప్రమాదవశాత్తు పెద్ద పరిమాణంలో ఉన్న గుండ్రని వక్కను మింగిన మూడేళ్ల చిన్నారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్సను కర్నూలులోని మెడికవర్‌ హాస్పిటల్‌ వైద్యులు విజయవంతం చేశారు. బుధవారం చికిత్స వివరాలను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ సమద్‌, పీడియాట్రిస్ట్‌ డాక్టర్‌ సింధూర వివరించారు. కర్నూలుకు చెందిన మూడేళ్ల బాలుడు ఇటీవల అనుకోకుండా వక్కను మింగడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆసుపత్రికి తీసుకురాగా ఎండోస్కోపీ ద్వారా పరీక్షించి గొంతులోని పోస్ట్‌ క్రికోయెడ్‌ ప్రాంతంలో వక్క ఇరుక్కుపోయినట్లు గుర్తించామన్నారు. చిన్నారి వయస్సు, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనస్థిటిస్ట్‌ సహాయంతో వక్కను జాగ్రత్తగా తొలగించినట్లు తెలిపారు. చిన్నపిల్లలు వక్కలు, నాణేలు, గోలీలు, చిన్న బొమ్మల భాగాలు, బ్యాటరీలు వంటి వస్తువులను అనుకోకుండా మింగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, తల్లిదండ్రులు ఇలాంటి వస్తువులు వారికి అందకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా వస్తువు మింగినట్లు అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడవచ్చన్నారు.

లారీ ఢీకొని బైకిస్టు దుర్మరణం

వెల్దుర్తి: పట్టణ పరిధిలోని డోన్‌ రైల్వే గేట్ల అవతల ఉన్న హైవే 44 సర్కిల్‌లో ఆగి ఉన్న బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన అమర్‌ (34) కర్నూలు ఐసీఐసీఐ బ్యాంకు ఫైనాన్స్‌ రికవరీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. వెల్దుర్తి, డోన్‌ మండల పరిధిలో విధి నిర్వహణ పూర్తి చేసుకుని డోన్‌ వైపు నుంచి హైవే మీదుగా కర్నూలు బయలు దేరాడు. రాత్రి వెల్దుర్తి సమీపంలోకి రాగానే టీ తాగేందుకు సర్కిల్‌ పక్కన ఉన్న హోటల్‌ ఎదురుగా బైక్‌ ఆపాడు. అదే సమయంలో ఫోన్‌ రావడంతో బైక్‌పై కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కర్నూలు వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ అదుపుతప్పి హోటల్‌ వైపు దూసుకొచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అమర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. హోటల్‌ వద్ద ఉన్న వారు లారీ దూసుకురావడాన్ని గమనించి పరుగులు పెట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న హైవే, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement