పాణ్యం: ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ వెంట అక్రమ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు బరితెగించారు. అనేకసార్లు గ్రావెల్‌ను తరలించారు. ఫలితంగా ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ కట్టలు తెగేలా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు, సీనియర్ ఇంజినీర్లు చెబుతున్నారు. గోరుకల్లు జలాశయం వద్ద ప్రధాన కాల్వకు ఆధారంగా ఉండే గ్రావెల్‌ను సైతం తలిస్తున్నారు. పట్టపగలు భారీ యంత్రాలతో, భారీ టిప్పర్లలో గ్రావెల్ తరలించుకుపోతున్నా ఎలాంటి చర్యలు లేవు. ఎవరైనా సామాన్య ప్రజలు గంప మట్టి తీస్తే నిబంధనలు చెప్పే అఽధికారులు ఇంతలా గ్రావెల్ తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. అఽధికారులకు తెలిసే గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రధాన కాల్వకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ఆదివారమే ఎందుకు?
ఎస్సార్బీసీ కాల్వ కట్టల నుంచి భారీ యంత్రాలతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. శనివారం నుంచి తరలిస్తున్నప్పటికీ అధికారులకు తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అదనుగా చూసుకున్న అక్రమార్కులు ఆదివారం కూడా తరలించారు. ఈ విషయం చీఫ్ ఇంజినీర్‌కు తెలియగా.. ఆయన ఆదేశాలతో మధ్యాహ్నసమయంలో గ్రావెల్ తరలింపు ఆపేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఎవ్వరు రాలేదు. ఇదిలా ఉండగా గతంలో పాణ్యం–దుర్వేశి రోడ్డు వేసే క్రమంలో కాంట్రాక్టర్లు గోరుకల్లు మలుపు వద్ద కాల్వకు ఉన్న సపోర్టు గ్రావెల్‌ను తవ్వారు. తవ్విన గుంతలో నీటి ఊటలు పడ్డాయి. ఉదయానికి దినపత్రికల్లో వార్తలు రావడంతో రాత్రికిరాత్రి గుంతలను పూడ్చి మమ అనిపించుకున్నారు. ఆ గుంతలు తవ్వింది కూడా ఆదివారమే కావడం విశేషం. ఇలా చాలా సార్లు ఆదివారమే గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అధికారులు తనిఖీలకు రాబోరని ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. అధికారులు ప్రధాన కాల్వ భఽద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎస్సార్బీసీ కాల్వ వెంట
ఇష్టానుసారంగా తవ్వకాలు
గతంలో రోడ్డు నిర్మాణానికి
గ్రావెల్ తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు


