● సి.బెళగల్‌లో అలుముకున్న విషాదం
సి.బెళగల్: మేనమామ అంత్యక్రియలు ముగిసిన వెంటనే అల్లుడు మృతి చెందాడు. సి.బెళగల్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి ముందరింటి వెంకటేష్ అలియాస్ టీజీ వెంకటేష్ అనారోగ్య సమస్యలతో సోమవారం మృతి చెందాడు. ఈయన పెద్ద కుమారుడు వంశీ జార్జీయా దేశంలో ఎంబీబీఎస్ చదువుతుండటంతో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. ముందరింటి వెంకటేష్ మొదటి చెల్లి మంగమ్మను గ్రామంలోని బుసప్పకు ఇచ్చి 30 ఏళ్ల క్రితం వివాహరం చేశారు. వీరి ఇద్దరి కుమారుల్లో చిన్న రంగన్న (22) పెద్ద కుమారుడు. మేనమామ అయిన ముందరింటి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందినప్పటి నుంచి కూలి పనులు చేసే చిన్న రంగన్న దుఃఖంలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం మామ అంత్యక్రియల అనంతరం తమ ఇంట్లో స్నానం ముగించుకుని బయటకు వస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుల దగ్గర చూపించిన అనంతరం వైద్యం కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబంలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకోవడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి ముందరింటి వెంకటేష్ అంత్యక్రియల్లో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ముందరింటి వెంకటేష్ పాడెను మాజీ ఎమ్మెల్యే మోసి, తన సంతాపం తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సోమశేఖర్‌రెడ్డి, నాయకులు నాగేశ్వరరెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చిన్న రంగన్న, ముందరింటి వెంకటేష్ (ఫైల్)


