కర్నూలు: ఫోన్‌లో మాట్లాడేందుకు స్నేహితురాలు నిరాకరించినందుకు మనస్తాపానికి గురైన ఓ యువకుడు కర్నూలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. గోనెగండ్ల మండలం అలువాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు (24) కల్లూరులోని శివప్ప నగర్‌లో గది అద్దెకు తీసుకుని నాలుగు సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం తన స్నేహితురాలికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే రూమ్‌కు చేరుకుని ఉరి నుంచి తప్పించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతుని తండ్రి ప్రస్తుతం గుంటూరులో ఉన్నారు. ఆయన కర్నూలుకు చేరుకున్న తర్వాత పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తారని బంధువులు పోలీసులకు తెలిపారు. నాల్గవ పట్టణ పోలీసులు సంఘటనపై బంధువులతో ఆరా తీస్తున్నారు.


