మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠానికి హుండీ ద్వారా రూ.3,72,40,530 సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మే 3 తేదీ నుంచి 21 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ.3,61,40,030, నాణేలా రూపంలో రూ.11,02,500 వచ్చినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 67 గ్రాముల బంగారం, 511 గ్రాముల వెండి కానుకలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్‌కోనాపూర్ పాల్గొన్నారు.
కేఎంసీకి 250 ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలోని 250 ఎంబీబీఎస్ సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెన్యూవల్(పునరుద్ధరణ) చేసింది. 45 రోజుల్లోగా కళాశాలలో మౌలిక సదుపాయాలు, వైద్యపరమైన లోపాలను సరిదిద్దుకోవాలని షరతు విధించింది. ఎన్‌ఎంసీ పరిశీలనలో కళాశాలలో కనీస ప్రమాణాల ప్రకారం కొన్ని లోపాలను గుర్తించారు. అయినప్పటికీ 2026–27 విద్యాసంవత్సరం కోసం అధ్యాపకుల లభ్యత, భౌతిక సౌకర్యాలను సరిదిద్దడంలో విఫలమైతే సీట్ల తగ్గింపు లేదా ప్రవేశాల నిలిపివేత సహా శిక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సూచించింది. అయితే తాము కళాశాలకు సంబంధించి అన్ని వివరాలను ఎన్‌ఎంసీకి పంపించామని, వారు కేవలం ఆఖరి పేజీని చూసి లోపాలు ఉన్నట్లు పొరపాటు పడ్డారని, ఈ మేరకు తిరిగి వివరాలను ఆధారాలతో సహా పంపిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ పేర్కొన్నారు.
చదువుకుంటాను.. సీటు కేటాయించండి!
● కేజీబీవీ ఎదుట విద్యార్థిని నిరసన
కోసిగి: చదువుకుంటాను కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో సీటు కేటాయించాలని కౌతాళం మండలం కరణి గ్రామానికి చెందిన శృతి, విద్యార్థిని తల్లిదండ్రులు మహాదేవి, గోవిందులు కోరారు. బుధవారం కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట విద్యార్థినితో కలిసి తల్లిదండ్రులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శృతి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కుటుంబపోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లామని, తమ కుమార్తెకు మంత్రాలయం, కౌతాళం, కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో సీటు దొరకలేదన్నారు. తమ కుమార్తెకు సీటు ఇవ్వకపోతే తమతో పాటు కూలీ పనులకు తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. జిల్లా ఉన్నత విద్యాధికారులు స్పందించి తమ కుమార్తెకు సీటు కేటాయించి ఆదుకోవాలని కోరారు.
పదవీ కాలం ఆరునెలల పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఉన్న పాలకవర్గంలో ఒకరిని మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న చింతల నాగకుమార్ స్థానంలో తోట రామభూపాల్ నియమితులయ్యారు. పాలకవర్గంలో మిగిలిన వారందరూ యథతథంగా కొనసాగుతారు.
ఆలూరు ఫస్ట్.. కర్నూలు లాస్ట్
కర్నూలు(సెంట్రల్): జూన్ 15 నుంచి ప్రారంభమైన సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీలో ఆలూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలువగా.. కర్నూలు నియోజకవర్గం చివరి స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు జిల్లా మొత్తంగా 20,86,119 మంది ఓటర్లలో 16,10,793 మందికి ఎన్యుమరేషన్ ఫాంలను పంపిణీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా 52,506 మంది ఎన్యుమరేషన్ ఫాంలను సమర్పించారు. వీరంతా ఫాంలను త్వరలో తమ దగ్గరకు వచ్చే బీఎల్‌ఓలకు అందజేయాల్సి ఉంటుంది.


