రమణీయం.. సుదర్శనమూర్తి జయంతి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. సుదర్శనమూర్తి జయంతి ఉత్సవం

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ సుదర్శన మూర్తి జయంతి వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే దిగువఅహోబిలంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీ సుదర్శన మూర్తులను కొలువుంచారు. నవకలశస్థాపన అనంతరం, పంచామృతాలతో అభిషేకించారు. శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తలను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయ దేవురులతో కొలువైన శ్రీ నృసింహస్వామి ఎదురుగా శ్రీ సుదర్శన మూర్తిని కొలువుంచి వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ సదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు.

సుదర్శన హోమం ప్రత్యేకత

సాధారణంగా నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున సుదర్శన హోమం నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజు సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహించారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు ఆయుధాలు కలిగి ఉండి వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని భక్తుల విశ్వాసం. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ.

నేడు స్వాతి వేడుకలు

స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు జేష్టాభిషేక వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభిషేకం, అర్చనలు చేస్తారు. అనంతరం గరుడ సేవ కార్యక్రమాలు ఉంటాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement