● టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతిపై
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: వార్డు మెంబర్‌గా గెలవలేని వైకుంఠం జ్యోతి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన గుడిసె కృష్ణమ్మ తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఘాటుగా స్పందించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వేతనం తీసుకొని అసెంబ్లీకి వెళ్లకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నాడని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. అయితే గ్రామా ల్లో లభిస్తున్న ఆదరణను జీర్ణించుకోలేకనే గిట్టని వ్యక్తులను టీడీపీ నేతలు దాడులకు పురమాయిస్తున్నారన్నారు. వైకుంఠం జ్యోతి చుట్టూ పోలీసులను పెట్టుకొని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు మూడేళ్లు అసెంబ్లీకి వెళ్లని విషయం మర్చిపోయారా?
ఆలూరు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లడం లేదని, అక్కడికి వెళ్లి సమస్యలు పరిష్కారానికి మాట్లాడాలని టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడు నెలల క్రితం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మూడేళ్లు అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకోలేదా అని ప్రశ్నించారు. వైకుంఠం జ్యోతి ఇచ్చిన లక్షల రూపాయలకు అమ్ముడుపోయి గుడిసె కృష్ణమ్మ ఓ బీసీ ఎమ్మెల్యేపై అర్థ్ధరహితమైన విమర్శలు చేయడం తగదన్నారు. 2009లో ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన 8 నెలల్లోనే బోయ, కురువ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన సొంత పార్టీ కార్యకర్తలపైనే వైకుంఠం జ్యోతి దాడి చేయించారన్నారు. ఆలూరు అభివృద్ధికి రూ. కోట్లు తెచ్చినట్లు అబద్దపు మాటలు చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉండి నేను ఏం చేశానని మాట్లాడుతున్నారని.. ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అప్పుడు మంత్రిగా ఉన్నారని, ఆ విషయం ఆయన్ను అడగాలన్నారు.
ఓ ఎమ్మెల్యేకు
ప్రొటోకాల్ ఇవ్వడం తెలియదా?
ఎమ్మెల్యేగా తనకు కల్పించాల్సిన ప్రొటోకాల్ విషయంలో జిల్లా ఎస్పీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎలాంటి పదవి లేకపోయినా వైకుంఠం జ్యోతి చుట్టూ ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 20 మంది పోలీసుల బందోబస్తు కల్పించడం ఎంతవరకు సమంజసమో పోలీసుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా టీడీపీ నేతలు రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తానన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, ఎల్లప్ప, భాస్కర్, ఉరుకుందు, నాగప్ప, మల్లయ్య, రాజు, వరుణ్, బాషా, హనుమంతప్ప, గౌస్ పాల్గొన్నారు.


