నేడు జిల్లాకు సీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు సీఎం

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

కర్నూలు(సెంట్రల్‌): సీఎం చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూరు కంపెనీ ఏర్పాటు చేసిన గోల్డ్‌ మైనింగ్‌ కంపెనీలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న మొదటి ప్లాంట్‌కు ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే రెండో ప్లాంట్‌కు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ నేతృత్వంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. కంపెనీ వెలుపల నిర్వహించే బహిరంగ సభ, పార్టీ నాయకులతో మీటింగ్‌కు వేదికలను సిద్ధం చేశారు. దాదాపు 1,500 మంది పోలీసులతో పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటైంది.

916 పింఛన్ల కోత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో జూన్‌ నెల 4,45,769 పింఛన్లు ఉండగా.. జూలైలో 4,44,853కు తగ్గిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే 916 పింఛన్లపై కోతపడింది. ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వకపోవడం గమనార్హం. జూలై నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.194.43 కోట్లు బ్యాంకుల వారీగా నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

29 నుంచి సహకార వారోత్సవాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): అంతర్జాతీయ సహకార వారోత్సవాలు ఈ నెల 29 నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయమై సహకార శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. వారోత్సవాల్లో జిల్లా సహకార అధికారులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఇతర సహకార సంస్థలు పాల్గొననున్నాయి. కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై జూలై 6వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రతి జిల్లాలో వరల్డ్‌ లార్జెస్ట్‌ గ్రైన్‌ స్టోరేజీ ప్లాన్‌ స్కీమ్‌ కింద రూ.2 కోట్లతో గోదాము నిర్మించనున్నారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 2,900 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి జూలై 6న భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

సీసీ టీవీ ఇన్‌స్టలేషన్‌, రిపేరీపై ఉచిత శిక్షణ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సీసీ టీవీ కెమెరా అమర్చడం(ఇన్‌స్టలేషన్‌), రిపేరీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్‌ కె.పుష్పక్‌ తెలిపారు. జూలై నెల 7 నుంచి శిక్షణా కార్యక్రమాలు మొదలవుతాయని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సుకు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌కార్డు కలిగిన 19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు నిరుద్యోగ యువకులు మాత్రమేనని అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 08518–273710, 90007 10508, 96662 24931, 94409 05477 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

జిల్లాలో మూడు రోజులు వర్షాలు

ఎమ్మిగనూరు సెంటల్ర్‌: జిల్లాలో ఈ నెల 24, 26, 27వ తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ వయన్నార్‌ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement