ఐసెట్‌లో 1,309 మంది ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

ఐసెట్‌లో 1,309 మంది ఉత్తీర్ణత

May 17 2026 1:06 AM | Updated on May 17 2026 1:06 AM

నేడు జేఈఈ అడ్వాన్డ్స్‌ పరీక్ష నేడు ‘ తాలీం– ఎ – హునర్‌’

కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఐసెట్‌) ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,309 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 2న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ప్రాథమిక కీ ఈ నెల 6వ తేదీ విడుదల చేసి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఐసెట్‌ కర్నూలు జిల్లా నుంచి 1,205 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 999 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 905 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా నంద్యాల జిల్లాకు చెందిన 448 ఐసెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 404 మంది పరీక్షలు రాస్తే, 354 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఐయాన్‌ డిజిటల్‌లో కేంద్రం ఏర్పాటు

కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లో బీటెక్‌ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్డ్స్‌ పరీక్ష నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. మొదటి, రెండు విడతల్లో మెయిన్స్‌లో అర్హత పొందిన జిల్లాకు చెందిన 1,080 మంది విద్యార్థులు అడ్వాన్డ్స్‌ పరీక్షకు హాజరుకానున్నారు. కర్నూలు నగర శివారులోని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఐయాన్‌ డిజిటల్‌లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌–2, రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 7 గంటల నుంచే అనుమతించనున్నారు.

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదిన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘ తాలీం – ఎ – హునర్‌ ’ (టాలెంట్‌ టెస్ట్‌) నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సయిదా సబీహా పర్వీన్‌ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ టాలెంట్‌ టెస్ట్‌కు కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి మొత్తం 1,581 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ పరీక్షకు రెండు జిల్లాల్లో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం 1.15 గంటలకంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అలాగే హాల్‌ టికెట్‌, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్‌ గుర్తింపుకార్డు (ఆధార్‌ లేదా ఓటరు ఐడీ)ను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల (పరీక్షా కేంద్రం కోడ్‌ సీ 12 )లో 576 మంది, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ( ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర, కోడ్‌ 13 )లో 334 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

23న బీసీ

డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

సునయన ఆడిటోరియంలో

బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఈ నెల 23న కర్నూలుకు వస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సమీక్ష నిర్వహిస్తారన్నారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆసక్తి కలిగిన కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్నవారు తగు ఆధారాలతో వినతి పత్రాలను కమిషన్‌కు స్వయంగా అందించవచ్చన్నారు. వినతుల్లో వాస్తవాలను స్పష్టంగా తెలియజేయాలని, సాధ్యమైనంత వరకు తమ వాదనలకు మద్దతుగా అవసరమైన పత్రాలు, ఆధారాల నకళ్లను జతపరచాలన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement