● ఎరువుల దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా విక్రయాల్లో అక్రమాలను సహించేది లేదని, ఎరువుల దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరించారు. కర్నూలు పాత బస్టాండు ప్రాంతంలోని సూర్యట్రేడర్స్, బంగారుపేటలోని శివరామకృష్ణ ఎరువుల దుకాణాలను కలెక్టర్‌తోపాటు జేసీ నూరుల్ ఖమర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... యూరియా అమ్మకాలు విధిగా ఓటీపీ లేదంటే బయోమెట్రిక్ ద్వారా ఆన్‌లైన్‌లోనే జరుగాలన్నారు. ఫిబ్రవరిలో జరిగిన యూరియా విక్రయాలను ఏప్రిల్‌లో ఈ–పాస్‌లో నమోదు చేయడం నిర్లక్ష్యానికి పరకాష్టగా పేర్కొన్నారు. ఈ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, అవసరమైతే లైసన్స్‌లను సస్పెండ్ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 షాపులపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇబ్బడి ముబ్బడిగా యూరియా అమ్మకాలు చేసిన షాపులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించారు. సాగు తక్కువగా ఉన్న సమయాల్లో యూరియా అమ్మకాలు ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావు ఇస్తోందని పేర్కొన్నారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, ఏడీఏ సాలురెడ్డి, కర్నూలు మండల వ్యవసాయ అధికారి రూపల్ రోనాల్డ్ తదితరులు పాల్గొన్నారు.
శివరామకృష్ణ దుకాణంపై సస్పెన్షన్ వేటు
కర్నూలు బంగారు పేటలోని శివరామకృష్ణ పర్టిలైజర్స్‌లో రికార్డుల నిర్వహణ సరిగా లేనట్లు కలెక్టర్ గుర్తించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నంద్యాల జిల్లాకు యూరియా ఇవ్వడానికి కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లైసన్స్‌ను రద్దు చేస్తూ వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


