వెల్దుర్తి: మండల పరిధిలోని రామళ్లకోట గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట పరిసరాల్లోని అరటితోట దగ్ధమైంది. గురువారం బాధిత రైతు గ్రామానికి చెందిన పెద్ద మాధవస్వామి తెలిపిన వివరాల మేరకు.. ఎకరా పొలంలోని అరటి పంట 2వ దఫా కోతకు వచ్చింది. బుధవారం దండ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో రేగిన నిప్పు రవ్వలకు మంటలు చెలరేగి పంటకు వ్యాపించాయి. అరటి బోదెలు, గెలలు అంటుకుంటూ వెళ్లి దాదాపు 4 టన్నుల అరటి కాయల దిగుబడి, చెట్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న వెళ్లిన బాధిత రైతు కుటుంబం మంటలను ఆర్పి మిగిలిన కాస్త పంటను కాపాడుకున్నారు.
అపస్మారకస్థితిలో మహిళ
ఎమ్మిగనూరురూరల్: ఆదోని రోడ్డు ఎస్‌ఎంల్ డిగ్రీ కాలేజీ, ఎల్లీల్సీ కాలువ మధ్యలో గురువారం తెల్లవారుజామున రక్తగాయాలతో ఓ మహిళ అపస్మారకస్థ్థితిలో కనిపించింది. పట్టణంలోని మైనార్టీ కాలనీకి చెందిన షఫీయాబీ(38) బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఆదోని రోడ్డు పై రక్తగాయాలతో కనిపించింది. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ కైలాస్, పైలెట్ గజేంద్ర అపస్మారకస్థితిలో ఉన్న మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో మహిళ ఆచూకీ గుర్తించిన వారు బంధువులకు సమాచారం అందించారు. అసుపత్రికి చేరుకున్న షఫీయాబీ బంధువులు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
ఎరువుల వ్యాపారి ఆత్మహత్య
పాణ్యం: నంద్యాలకు చెందిన ఓ ఎరువుల వ్యాపారి అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాణ్యంలోని ఎస్సార్బీసీ కాల్వ సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి ఆచూకీ గుర్తించారు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల ఎన్జీఓస్ కాలనీకి చెందిన ద్వారం వెంకటసుబ్బారెడ్డి(40) నూనెపల్లె లోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం వరకు షాప్‌లో ఉన్న అతను బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో గురువారం పాణ్యం ఎస్సార్‌ర్బీసీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్య లు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. మృతదేహం పక్కన పురుగు మందు, ఆహారం డబ్బాలు ఉండడంతో పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
వలసబాటలో మృత్యుఒడికి..
ఎమ్మిగనూరురూరల్: గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం కాటవారిపాలెంలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామానికి చెందిన సురేష్(21) మృతి చెందగా, జగన్ అనే మరో యువకుడికి గాయాలయ్యాయి. వివరాలు.. ఏనుగుబాల గ్రామానికి చెందిన బజారి, శంకరమ్మలకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం బజారి చనిపోయాడు. సురేష్ డిగ్రీ వరకు చదువుకున్నా ఉపాధి లేకపోవటంతో తల్లితో పాటు గుంటూరు జిల్లాకు మిరప కోత పనులకు వెళ్లాడు. కాటవారిపాలెంలో గురువారం పనులు చేస్తుండగా పిడుగు పడటంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, పక్కనే ఉన్న జగన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స కోసం సత్తనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


