కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తికి అరుదైన అవకాశం లభించింది. ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ –2026’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశానికి ఎంపికై ంది. ఈ మేరకు గురువారం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు శివకీర్తిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘మైభారత్ బడ్జెట్ క్వెస్ట్ –2026’ పోటీల్లో ఫైనల్ రౌండ్‌కు శివకీర్తి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. దేశ యువతలో కేంద్ర బడ్జెట్ 2026–27 ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించడం ద్వారా విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడం కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఆన్‌లైన్ క్విజ్‌తో పాటు వ్యాసరచన పోటీల్లో దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అందులో తొలి రెండు దశలను విజయవంతంగా అధిగమించి శివకీర్తి ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిందన్నారు. ఈనెల 12, 13 తేదీల్లో జరిగే ఫైనల్ రౌండ్‌లో పాల్గొంటుందన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థిని ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్‌నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్. భరత్ కుమార్ శివకీర్తిని అభినందించారు.


