న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

జిల్లా బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టంపై తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని కర్నూలు జిల్లా బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను ఖండిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు ధర్నా చేపట్టారు. నిరసన అనంతరం కోర్టు విధులు కూడా బహిష్కరిస్తూ న్యాయవాదికి మద్దతుగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, ఐఏఎల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రవికాంత్‌ ప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాది ఓంకార్‌ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదులపై ఇటీవల కాలంలో భౌతిక దాడులు అధికమయ్యాయన్నారు. న్యాయవాదులు న్యాయం కోసం కోర్టుల్లో ప్రజల పక్షాన వాదన చేస్తుంటే కేసు విషయంలో కక్షలు, కుతంత్రాలతో కొంతమంది దుండగులు నేర ప్రయత్నాలు చేయడం, హత్య చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని విమర్శించారు. పీలేరు సంఘటనను న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. ఏపీలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ఆ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తేవడం జరిగిందని గుర్తు చేశారు. ఏపీలో కూడా న్యాయవాదులపై దాడులు, హత్యల నివారణకు తక్షణమే రక్షణ చట్టం తేవాలని కోరారు. వైస్‌ ప్రెసిడెంట్‌ మద్దిలేటి, రాజేష్‌, హుసేన్‌, ప్రసాద్‌, సురేష్‌, షఫి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యాయ వ్యవస్థకే ముప్పు..

న్యాయం కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్న తరుణంలో వారిపై దాడులు, హత్యలు జరిగాయని, వీటిని అరికట్టకపోతే న్యాయ వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో యువ న్యాయవాది యల్లయ్యపై దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేయడాన్ని ఐలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement