కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండించిన మామిడి కెనడా, అమెరికా దేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ఇక్కడ పండించిన బంగినపల్లి రకం మామిడిని కృష్ణ జిల్లా పామర్రులోని కోసూరు బాలాజీ ఆగ్రో పుడ్ ప్రయివేటు లిమిటెడ్ ద్వారా ఎగుమతులు చేయనున్నట్లు తెలిపారు. గురువారం కోసూరు బాలాజీ ఆగ్రో ఫుడ్ ప్రయివేటు లిమిటెడ్ ప్రతినిధి శ్రీనివాసరావుతో కలసి ఓర్వకల్ మండలం గుడుంబాయి తండాలోని మామిడితోటలను పరిశీలించారు. తోటల్లోని మామిడి ఎగుమతులకు తగిన నాణ్యతతో ఉందని గుర్తించారు. ఎక్స్‌పోర్టు నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు జిల్లా ఉద్యాన అధికారి వివరించారు. కంపెనీ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ కంపెనీ టన్నుకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎగుమతులకు అవకాశం ఉండాలంటే తగిన ఫ్రూట్‌కేర్ యాక్టివిటీస్ చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఈ పద్ధతులు పాటిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు.


