వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగర పాలక సంస్థ కార్పొరేటర్ల పదవి కాలం ముగియడంతో పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లను కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ శాలువ కప్పి సన్మానించారు. కల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కాటసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా ఐక్యతతో ఐదేళ్ల పాలన దిగ్విజయంగా అందించామన్నారు. కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ ఒత్తిడిలకు తలొగ్గకుండా పార్టీలో ఉండి వార్డులను అభివృద్ధి చేశారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత పట్టుదలతో పని చేసి మరోసారి మేయర్ పీఠాన్ని దక్కుంచుకుందామన్నారు. మేయర్ రామయ్య మాట్లాడుతూ ఐదేళ్లలో రూ. 800 కోట్లతో కర్నూలు నగరంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామన్నారు. పారిశుద్ధ్యంలో కర్నూలు నగరం మెరుగైన ర్యాంకు సాధించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిసిపలిటీ స్టాండింగ్ కమిటీకి రెండు సార్లు ఎన్నికల జరిగాయన్నారు. ఐక్యంగా ఉండడంతో స్టాండింగ్ కమిటీలో రెండు సార్లు తామే గెలిచామన్నారు. మేయర్ రామయ్య, డిప్యూటీ మేయర్ ఎస్. రేణుక, కార్పొరేటర్లు నాగలక్ష్మీరెడ్డి, అరుణ, దండు లక్ష్మీకాంతరెడ్డి, పల్లె శారద, నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, సాన శ్రీనివాసులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, గాజుల శ్వేతారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని విక్రమసింహారెడ్డి, సాంబశివరావు, కో ఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి తదితరులను కాటసాని దంపతులు సత్కరించిన వారిలో ఉన్నారు.


