● రోడ్డున పడిన 64 కుటుంబాలు
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వాసుప్రతి ప్రహరీ గోడ పక్కన మున్సిపల్ స్థలంలో పేదల గుడిసెలను బుధవారం తొలగించారు. ఉదయం 6 గంటలకే మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. గుడిసెల్లో ఉన్న వారు అందోళనకు దిగారు. ప్రొక్లెయిన్లను, అధికారులను అడ్డుకోవటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హైకోర్టు ఉత్వర్వులు ఉన్నాయని, తామేమీ చేయలేమని, ఇంత ముందే గుడిసెలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. బాధితులు వినపించకోకుండా గుడిసెలను తొలగించరాదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి హైకోర్టు ఉత్తర్వులను ఎవరూ అడ్డుకోవటానికి లేదని, ప్రొక్లెయిన్‌లతో 64 గుడిసెలను తొలగించారు.
పండుగ పూట రోడ్డున పడేశారు!
‘పిల్లలతో పండగ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు..పండగ పూట రోడ్డున పడేశారు.’ అంటూ బాధితులు అవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న తాము ఖాళీ చేయాలంటే ఎలా అని రోదించారు. తమ పిల్లలకు పదో తరగతి పరీక్షలు ఉన్నాయని చెప్పినా అఽధికారులకు కనికరం కూడా లేకుండా పోయిందన్నారు. మొత్తం 64 గుడిసెలను తొలగించటంతో పిల్లపాపాలతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంత మంది అద్దె ఇళ్లు వెతుక్కోగా, మరి కొందరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. కాగా.. బాధితులు బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు.


