బాలుడికి ప్రాణం పోశారు
కర్నూలు(హాస్పిటల్): కడప జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు అరుదైన జబ్బు కారణంగా రక్తపు వాంతులు, తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న బాలునికి సైతం మేమున్నామంటూ భరోసానిచ్చి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు ఇక్కడి వైద్యులు. బుధవారం ఈ కేసు వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘కడప జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని రాజుపల్లి గ్రామానికి చెందిన శివ, ఆదిలక్ష్మిల కుమారుడైన పెంచలయ్య(15) రెండు నెలలుగా నల్లటి మలం(మెలినా), రక్తపు వాంతులు,(హీమాటెమేసిన్), తీవ్ర బలహీనతతో బాధపడుతున్నాడు. కడపలో వైద్యులకు చూపించగా డియోడినమ్‌లో రక్తస్రావం కలిగించే పుండ్లు(డియోడినమ్ అల్సర్స్) ఉన్నట్లు గుర్తించారు. జనవరిలో అతనికి ఎండోస్కోపి ద్వారా ప్యాడ్‌లాక్ క్లిప్ అమర్చినా రక్తస్రావం పూర్తిగా ఆగలేదు. ఆ సమయంలో అతనికి హీమోగ్లోబిన్ స్థాయి 2.5 గ్రాములు మాత్రమే. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆ బాలుడిని గత నెల 17వ తేదీన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం వైద్యులు పరీక్షించి ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్(ఏపీసీ)ద్వారా చికిత్స చేసినా రక్తస్రావం తగ్గకపోవడంతో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు గత నెల 26న ప్రాక్సిమల్ ఇలియమ్ భాగంలో ఎంటెరోటమి చేసి ఎండోస్కోపి నిర్వహించారు. ఇందులో యాంజియో ఎక్టేసియా(రక్తనాళాల అసాధారణ విస్తరణ)ను గుర్తించి, దానిపై కూడా ఏపీసీ చికిత్స అందించారు. అదే సమయంలో డియోడినల్ అల్సర్ నుంచి రక్తస్రావం కొనసాగుతుండటంతో ఎండోస్కోపి నిర్వహించిన తర్వాత, ఎక్స్‌ప్లోరేటరి లాపరోటమి చేశారు. గ్యాస్ట్రో డియోడినల్ ఆర్టరి(జీడీఏ)ను లిగేషన్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. దాదాపు 8 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడు. డిశ్చార్జ్ సమయానికి అతనిలో హిమోగ్లోబిన్ స్థాయి 10 గ్రాములకు పెరిగింది’ అని వివరించారు. ఈ క్లిష్టమైన కేసును శస్త్రచికిత్స విభాగం యూనిట్–2 చీఫ్ డాక్టర్ ఆర్. రామకృష్ణనాయక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స అందించడంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు హెచ్‌ఓడీ డాక్టర్ మోహన్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ సందీప్‌రెడ్డి, డాక్టర్ అర్షియా, అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ సుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీప్రభాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ గీత శ్రావణి కీలక పాత్ర పోషించారు.


