ఆలూరు రూరల్: చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి డ్రగ్స్‌కు ఏపీ అడ్డగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారిపైనే కాల్పులకు తెగబడటం అత్యంత దారుణమన్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఆలూరు నియోజకవర్గంలో సైతం గుట్టుగా గంజాయి సాగు జరుగుతోందన్నారు. గంజాయి, కల్తీ మద్యం అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతోందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డ యువత అరాచకాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారన్నారు. గత ఆదివారం ఆలూరు–ఆస్పరి మండలాల పరిధిలోని చిన్నహోతూరు, మరకట్టు, మూసానహల్లి గ్రామాల మధ్య అడవిలో పేకాట స్థావరాలపై జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్టు చేసి రూ.5.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారంటే నియోజకవర్గంలో పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జున, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


