‘ఉల్లంఘనల’ మూల్యం రూ.10 కోట్లు!
● ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని
వాహనదారులు
● జరిమానాల జోరుతో జేబులు గుల్ల
కర్నూలు: బైకులపై రయ్‌మంటూ దూసుకెళ్లడం.. హెల్మెట్ లేకుండా దర్జాగా రోడ్డు ఎక్కడం.. తాగిన తర్వాత వాహనాన్ని నడపటం.. వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం.. ఇలా నిబంధనలకు విరుద్ధమైన ప్రయాణాల జోరు జిల్లాలో పెరుగుతోంది. ఏమవుతుందనే సాహసమో.. ఒక్కసారే కదా.. అనే నిర్లక్ష్యమో, ఏదైతేనేమి ప్రయాణికుల వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఎవరికి వారుగా చిన్నపాటి మొత్తంగానే భావించినా... ట్రాఫిక్ ఉల్లంఘనులకు వాహనదారులు తగిన మూల్యాన్ని మాత్రం భారీగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం 12 ఉల్లంఘనలకు సంబంధించి 92 వేలకు పైగా కేసులు నమోదైన తీరు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మొదటి స్థానంలో
లైసెన్స్ రికార్డు లేని కేసులు
92వేల కేసుల్లో లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా నడిపిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇందుకు రూ.43 లక్షలు వాహనదారులు జరిమానా రూపంలో చెల్లించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిప్పుతున్న వాహనాలపై నమోదైన కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా పట్టించుకోని వాహనదారులపై 9,332 కేసులు నమోదయ్యాయి. అలాగే రాంగ్ రూట్ ప్రయాణాల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటమే దీనికి కారణమని తెలిసినప్పటికీ వాహనదారుల్లో మార్పు కరువైంది. సమయం కలసి వస్తుందని కొందరు వాహనదారులు చేస్తున్న తప్పిదం ఎంతోమంది ప్రాణాల మీదకు తెస్తోంది. ‘యూటర్న్’ తీసుకుని వెళ్లాలంటే ఫర్లాంగ్, అర కిలోమీటర్ దూరం ప్రయాణించాల్సి వస్తోందని రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదు.
‘మత్తు’గా దొరికిపోతున్నారు
మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్నా.. ఆ మత్తులో చిత్తవుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో యువతే అధిక సంఖ్యలో ఉండటం ఆందోళనకర పరిణామం. గత ఏడాది జిల్లాలో ఏకంగా 9,360 మంది మందుబాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానాల్లో హాజరుపర్చగా మొదటి ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.3 వేలు, రెండవ ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.10 వేలు చొప్పున జరిమానా రూపంలో రూ.6.50 కోట్లు మూల్యం చెల్లించారు.
తలకెక్కించుకోవాలి..
హెల్మెట్ వినియోగం విషయంలో ఇంకా జిల్లాలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిరోభారం అనే ఆలోచనను వాహనదారులు వీడాల్సిన అవసరం ఉంది. ఏకంగా 10,735 మందికి వీటిని ధరించకపోవడం వల్ల జరిమానా పడింది. అంటే 12 నెలల కాలంలో రూ.45.50 లక్షలు జరిమానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. సిగ్నల్ జంపింగ్, అధిక బరువు, మైనర్లు వాహనాలు నడపటం, అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లడం లాంటి కేసుల సంఖ్య తగ్గేలా వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.


