కమనీయం.. కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో పార్వతీ, పరమేశ్వరులకు లీలాకల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ సంకల్పం తర్వాత మహా గణపతిపూజ, పుణ్యహావచనం జరిపారు. ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి సింహాసనానికి, కంకణాలకు పూజాదికాలు చేశారు. స్వామికి యజ్ఞోపవీతధారణను చేసి మంత్రాలను పటించారు. అమ్మవారికి కంకణధారణ జరిపారు. మహాసంకల్పం తరువాత మంగళకరమైన ఎనిమిది శ్లోకాలు చదివి స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. మాంగల్యపూజ జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి స్థానిక చెంచులు నూతన వస్త్రాలతో పాటు అడవి ఆకులతో అల్లిన అభరణాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై అధిష్టింప చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.
శాస్త్రోక్తంగా గోపూజ
రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కనుమ పండుగరోజైన శుక్రవారం శ్రీశైల దేవస్థానంలో శ్రీగోకులంలో, గోసంరక్షణశాల వద్ద శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో రావణవాహనంపై అధిష్టింపజేశారు. ఆలయ ఉత్సవం దేదీప్యమానంగా కొనసాగింది. రావణవాహనంపై స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజల అనంతరం స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు.
అడవి ఆకులతో ఆభరణాలు
సమర్పించిన చెంచులు
కనుమ పండుగ రోజున
రావణవాహన సేవ
నేడు సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు
యాగపూర్ణాహుతి
కమనీయం.. కల్యాణోత్సవం


