ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(టౌన్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలను జిల్లా కోర్టు వెబ్‌సైట్ www.ecourts.kurnool.com అలాగే kurnool.dcourts.gov.in లో చూసుకోవచ్చన్నారు. ఈ నెల 27న సాయంత్రం 6 గంటల్లోపు జిల్లా కోర్టు కాంపౌండ్‌లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్రస్ పేరుతో రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు.
ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో శుక్రవారం ఆంధ్ర పరిధిలోని హొళగుంద సెక్షన్ దిగువ కాలువలో 70 శాతం మేర నీటి సరఫర తగ్గుముఖం పట్టింది. 1633 అడుగులతో 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న టీబీ డ్యాంలో శుక్రవారం 1604 అడుగులతో 27.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో జీరో ఉండగా.. ఔట్‌ఫ్లో దాదాపు 250 క్యూసెక్కులు నమోదైంది. ఇక ఎల్లెల్సీ ఆంధ్ర కాలువ ప్రారంభం 250 కి.మీ వద్ద దాదాపు 270 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది. శనివారం రాత్రికి పూర్తిగా జీరో కానుంది. జలాశయంలో 33 కొత్త క్రస్టుగేట్ల ఏర్పాటు పనులు జరుగుతుండడంతో ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటిని నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టీబీ బోర్డు అధికారులు డ్యాంలో ఉన్న 27.5 టీఎంసీల నీటిని తాగునీరు, ఇతర అత్యవసరాలకు ఉంచుకోనున్నారు. మే నెలాఖరు నాటికి గేట్లను అమర్చే పనులు పూర్తయితే జూలైలో మళ్లీ కాలువలకు నీటి విడుదల పునరుద్ధరించనున్నారు. ఈ మధ్యలో రెండు, మూడు సార్లు తాగునీటి అవసరాలకు కాలువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు.
తప్పుడు కేసులు ఇంకెన్నాళ్లు?
కర్నూలు (టౌన్): ప్రజల నుంచి వైఎస్సార్‌సీపీకి విశేష మద్దతు వస్తుండటంతో తప్పుడు కేసులు నమోదు చేసి టీడీపీ నాయకులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. ఇటీవల తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని, శుక్రవారం డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరైనట్లు చెప్పారు. గతేడాది డిసెంబర్ నెలలో తాను ఇంటికి వెళుతున్న సమయంలో సంకల్ బాగ్ సమీపంలో మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా నిలబడి బుధవారపేటకు చెందిన చంద్రశేఖర్, మరి కొంత మంది ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి గొడవలు లేకున్నా తాను ఇంటికి వెళ్లగా రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు.


