ఎర్రమట్టి.. కొల్లగొట్టి!
● కొండను మాయం చేస్తున్న
టీడీపీ నాయకులు
● చర్యలు తీసుకోవడంలో
అధికారులు విఫలం
ఆలూరు: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు బరితెగించారు. అక్రమార్జనే లక్ష్యంగా ఎర్రమట్టిని దోపిడీ చేస్తున్నారు. కొండలో సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామ సమీపంలో ఎర్రమట్టి కృష్టాపురం కొండ 105 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విండ్ పవర్ కోసం టీడీపీ నాయకులు అక్కడ 350 వరకు ఫ్యాన్లు వేయడానికి, అలాగే సోలార్, పవర్‌గ్రిడ్ కంపెనీలకు లింక్ రోడ్లు వేయడానికి ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. రాత్రి సమయంలో కొండ నుంచి ఎర్రమట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రతి రోజూ పది టిప్పర్లలో 18 నుంచి 22 టన్నుల వరకు ఎర్రమట్టిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అయినా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలకు వస్తున్నాయి.
ఎన్‌ఓసీని రద్దు చేయాలని ధర్నా
హత్తిబెళగళ్ గ్రామ సమీపంలో క్వారీలో పేలుళ్ల కారణంగా 2018 ఆగస్ట్ 3న చత్తీస్‌ఘడ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన 12 మంది కార్మికులు మృతి చెందారు. తిరిగి పది ఎకరాలను లీజుకు తీసుకుని క్వారీని పేల్చుతున్నారు. లీజుదారుడి ఎన్‌ఓసీని రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట హత్తిబెళగళ్ గ్రామస్తులు గత నెల 28న ధర్నా చేశారు. అదేవిధంగా గనులు, భూగర్భజల శాఖ అధికారులకు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. సమక్షంలో విచారణ చేసి క్వారీని నిలిపివేయడానికి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ప్రస్తుతం తాత్కాలికంగా పనులను నిలిపి వేయాలని లీజుదారులను ఆదేశించారు.


