విద్యుత్ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్‌సీ) ఈ నెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌సీడీసీఎల్ చైర్మన్, సీఎండి శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం.. 22, 23వ తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు కార్యక్రమం ఏర్పాటవుతుందన్నారు. ప్రతి రోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తారన్నారు. అభిప్రాయాలను తెలియపర్చాలనుకుంటే ఆయా వేదికల వద్ద నేరుగా పాల్గొనవచ్చని, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అవకాశం కల్పిస్తామన్నారు.


